హైదరాబాద్ లో ఇదొక రికార్డు.. ఒకే ఒక్క రాత్రిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఏకంగా 103 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అసలే వాలంటైన్స్ డే, పైగా వీకెండ్. ఇంకేముంది.. భాగ్యనగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో పబ్బులన్నీ నిండిపోయాయి. జంటలు జంటలుగా వచ్చి తాగితందనాలాడారు. ఇంతవరకు ఓకే. ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది.
తాగి వాహనం నడపడం నేరమనే విషయం తెలిసి కూడా స్టీరింగ్ పట్టుకున్నారు. అలాంటివాళ్లను వంద మందిని ఒకే రాత్రి బుక్ చేశారు హైదరాబాద్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వాళ్లందరిపై కేసులు పెట్టారు. ఏకంగా 40 కార్లు సీజ్ చేశారు. 60 బైకుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా వాలంటైన్స్ డే పుణ్యమే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మహిళలు కూడా ముందున్నారు. రాత్రి నమోదు చేసిన కేసుల్లో దాదాపు 40 మంది అమ్మాయిలున్నారు. మోతాదుకు మంచి తాగి స్టీరింగ్ పట్టుకున్నారు వీళ్లంతా. ఎవ్వర్నీ పోలీసులు వదల్లేదు. అందరి వాహనాలు సీజ్ చేశారు.
వీళ్లందరికీ బేగంపేట్ లో కౌన్సిలింగ్ ఏర్పాటుచేశారు. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. వీళ్లలో తొలిసారి ఇలా దొరికిన వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కౌన్సిలింగ్ తో సరిపోతుంది. 2-3 సార్లు ఇలా దొరికిన కేసులుంటే మాత్రం వాళ్ల డ్రైవింగ్ లైసెన్స్ రద్దవ్వడమే కాకుండా.. జైలుశిక్ష కూడా పడుతుంది. ప్రేమికుల రోజున ఫుల్లుగా తాగిన ప్రేమజంటలు ఇలా అడ్డంగా బుక్కయ్యారు.