ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఏపీలో ఎన్నికల బహిష్కరణల పిలుపులు ఇచ్చుకుంటూ.. అదే తన బలమని చెప్పుకుతిరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాల్సిన పార్టీ, ఇలాంటి బహిష్కరణలతో పొద్దు పుచ్చుతోంది. ఈ పరిస్థితుల్లో కూడా నెల్లూరులో మాత్రం టీడీపీ నేతలు కొంత వరకూ పోరాట స్ఫూర్తిని చాటుతున్నారు.
ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికకు గానూ టీడీపీ ఒకేసారి 54 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. డివిజన్ల వారీగా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ నెల్లూరు రూరల్, అర్బన్ ఇన్ చార్జిలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ లు అభ్యర్థులను అయితే ఘనంగా ప్రకటించారు.
వాస్తవానికి వారిలో అనామకులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో నామినేషన్ లు వేయించడం కూడా నేతలకు తలపోటుగా మారింది. పార్టీ మీటింగ్ అంటూ పిలిచి.. వచ్చిన వారి చేత సంతకాలు పెట్టించి, నామినేషన్లు వేయించారనేది నిజం. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలప్పుడే అది జరిగింది.
కార్యకర్తలను పార్టీ ఆఫీసుల వద్దకు పిలిచి నామినేషన్ పత్రాల మీద వారి చేత సంతకాలు పెట్టించుకున్నారు. మీరే అభ్యర్థి అనివారికి చెప్పారు. మొదట్లో ఖర్చులకు ఇస్తామంటూ వారిని ఊరించారు. అయితే తీరా ఎన్నికల ప్రక్రియ వచ్చాకా టీడీపీ ఇన్ చార్జిలు కూడా చేతులెత్తేశారు.
ఇక నెల్లూరులో కూడా అదే జరిగినట్టుగా ఉంది. కార్యకర్తల సమావేశాలకు పిలుపును ఇచ్చి.. వారినే అభ్యర్థులు అని ప్రకటించినట్టుగా ఉన్నారు. అలాగే వారికి ఖర్చులకు డబ్బులనే మాటతో ఊరించారట. తీరా అసలు కథ మొదలయ్యాకా యథారీతిన మొండి చేయి చూపించారట టీడీపీ నేతలు. సొంత ఖర్చులతో ప్రచారం కూడా తామెందుకు చేయాలన్నట్టుగా టీడీపీ డివిజన్ అభ్యర్థులు నామినేషన్ల విత్ డ్రాలకు కూడా వెనుకాడలేదు.
ఫలితంగా 54 మంది అభ్యర్థుల్లో 11 మంది విత్ డ్రా మార్గాలను అనుసరించారు. ఇక మరి కొందరు ప్రచార పర్వానికి డబ్బుల గురించి లెక్కలేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రచార ఆర్బాటానికి అయినా ఇన్ చార్జిలు ఖర్చులు పెడితే తాము పోటీలో ఉన్నట్టే అని లేకపోతే తమ తరఫున ఎలాంటి ప్రచారం ఉండదంటూ వారు నేతలను హెచ్చరిస్తున్నట్టుగా సమాచారం.