ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు రేపిన చిచ్చు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాల వెనకున్న ఉద్దేశాలపై జగన్ సొంత పత్రికలో సీరియల్ కథనాలు రాస్తోంది.
మరోవైపు చంద్రబాబు అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డకు గట్టి మద్దతుగా నిలిచాయి. దీంతో ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ఘర్షణకు ఆజ్యం పోసినట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సాక్షి పత్రికలో 12 ఏళ్ల నాటి రాజ్‌భవన్ రాసలీలల రహస్యాన్ని తెరపైకి తేవడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వృద్ధనేత ఎన్‌డీ తివారి గవర్నర్‌గా ఉన్న కాలంలో జరిగిన సంఘటనను నేడు తెరమీదకు తేవడం వెనుక బలమైన కారణం లేకపోలేదు.
దీనికి కారణం ….ఆ సంఘటన జరిగే సమయానికి గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శిగా తాము విరోధిగా భావిస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రత్యేక కార్యదర్శిగా ఉండడమే. సాక్షిలో రాసిన కథనంలో నాటి రాజ్‌భవన్ రాసలీలల గురించి ఏం రాశారంటే…
‘చంద్రబాబుకు బినామీగా పేరున్న ఓ మీడియా అధిపతి ఆధ్వర్యంలో పన్నెండేళ్ల క్రితం ఓ ఎల్లో టీవీ ఛానెల్ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన ఆ ఛానల్‌కు రేటింగ్ దక్కేందుకు ‘రాజ్‌భవన్‌లో రాసలీలలు’ పేరిట రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియో ఫుటేజీ సదురు ఎల్లో టీవీ ఛానల్‌కు మాత్రమే లీక్ అవడం వెనుక కుట్ర దాగి ఉందని అప్పట్లోనే గుప్పుమంది. ప్రస్తుత ఎస్‌ఈసీ ఆ సమయంలో నాటి గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు’
చంద్రబాబు బినామీ మీడియా అధిపతి ఎవరు? 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎల్లో చానల్ ఏది? నాటి రాజ్‌భవన్ రాసలీలల సంగతేంటి? తదితర వివరాలు ఎవరి గురించో అందరికీ తెలుసు. అయితే నిమ్మగడ్డ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో కూడా జనానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా మున్ముందు ఇరుపక్షాల లీలలు ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో మరి!