నామినేషన్ల పర్వం.. టీడీపీలో నిస్తేజం

బాబుగారేమో.. టెలి కాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ లతో అన్నిచోట్లా పోటీకి నిలబడాలని కార్యకర్తలకు, కింది స్థాయి నేతలకు ధైర్యం నూరిపోస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తలవంచం అంటూ రెచ్చిపోతున్నారు.  Advertisement కట్ చేస్తే.. ఇక్కడ…

బాబుగారేమో.. టెలి కాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ లతో అన్నిచోట్లా పోటీకి నిలబడాలని కార్యకర్తలకు, కింది స్థాయి నేతలకు ధైర్యం నూరిపోస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తలవంచం అంటూ రెచ్చిపోతున్నారు. 

కట్ చేస్తే.. ఇక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇటీవల కొత్తగా అపాయింట్ మెంట్ లెటర్లు తీసుకున్న పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్ లు ఎన్నికల ప్రక్రియకు మొహం చాటేశారు. 

కేవలం ఈ హడావిడి అంతా నలుగురైదుగురితోనే జరుగుతుంది కానీ క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రణాళికలను వేసేందకు ఒక్కరూ ముందుకు రావడం లేదు.

ఖర్చుకి భయపడుతున్న నేతలు..

మాజీ ఎమ్మెల్యేలైనా, తాజా ఎమ్మెల్యేలైనా.. పోటీకి నిలబడండి అంటూ కార్యకర్తల్ని పురిగొల్పాలంటే.. వారికి అంతో ఇంతో ఆర్థికంగా అండగా నిలబడాలి. కానీ టీడీపీ నేతలు పూర్తిగా ఆ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఏ ఒక్కరూ డబ్బు తీయడానికి ముందుకు రావడం లేదు. 

అటు వైసీపీ నేతలు కూడా ఆర్థిక అండదండలు అందించే విషయంలో మరీ అంత ఉత్సాహం చూపించడం లేదు. అయితే అధికార పార్టీ కాబట్టి, ఆ లెక్క వేరుగా ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఖర్చు ఎంతైనా పర్లేదు ఏకగ్రీవం అయితే చాలు అనుకుంటుంటారు.

కానీ అదే ఉత్సాహం టీడీపీలో పూర్తిగా లోపించింది. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడమే కష్టం అనుకుంటున్న సమయంలో జిల్లా స్థాయి నేతలంతా మొహం చాటేసే సరికి ఉన్నవారిలో కూడా ఉత్సాహం ఆవిరైంది. కనీసం నామినేషన్ల పర్వానికి కలసి వచ్చేందుకు కూడా జిల్లా స్థాయి టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ కంటే బీజేపీ మేలు..

తొలి విడత నామినేషన్ల పర్వంలో టీడీపీపై బీజేపీది పైచేయిగా కనిపిస్తోంది. జనసేన నేతలతో కలసి బీజేపీ నేతలు నామినేషన్లకు తరలి వస్తున్నారు. ఏ ఒక్క పంచాయతీ మిస్ కాకుండా నామినేషన్లు వేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తుంటే.. ఇటు బీజేపీ నేతలు ఆ బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోంది. 

టీడీపీ నుంచి నామినేషన్లకు అభ్యర్థులు వెనకడుగు వేస్తుంటే, బీజేపీ వాళ్లు మాత్రం కొత్త ఉత్సాహంతో దూసుకొస్తున్నారు. అయితే వేసే ప్రతి నామినేషన్ చివరి వరకు ఉంటుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. 

ఉపసంహరణ రోజు చివరికి నిలిచిన వారే అభ్యర్థి కావడంతో ఈలోగా గ్రామాల్లో జరగాల్సిన తంతు పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నామినేషన్ల పర్వంలో అధికార వైసీపీ నేతలు ఎలాగూ ముందు వరుసలోనే ఉన్నారు. ఇక తొలివిడత నామినేషన్లు పడని పంచాయతీల్లో ఏకగ్రీవానికి లోపాయికారీగా ఒప్పందాలు జరిగిపోయినట్టే అనుకోవాలి.

నాలుగు విడతల్లో జరుగుతున్న పంచాయతీ సంబరంలో.. తొలివిడత నామినేషన్ల పర్వంలోనే టీడీపీ సత్తా ఏంటో తేలిపోయింది. నాయకులంతా ఎక్కడికక్కడ తేలుకుట్టిన దొంగల్లా ఇళ్లకే పరిమితం కాగా.. అరకొర నామినేషన్లతో ఆ పార్టీ పరువు బజారున పడింది. 

బలవంతపు ఏకగ్రీవాలు, బైండోవర్లు అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారే కానీ, గ్రామాల్లో టీడీపీ బలపరుస్తున్న అభ్యర్థులు బరిలో దిగడానికి పూర్తిగా భయపడుతున్నారు.

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా