జస్ట్ 24 గంటల కిందటే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ లో నమోదయ్యాయి. దీంతో కేసులు బాగా తగ్గిపోయాయని అంతా సంబర పడ్డాం. ఇది జరిగి 24 గంటలైనా గడవకముందే కరోనా షాకిచ్చింది. ఈ ఒక్క రోజే తెలంగాణలో 50 కరోనా కేసులు బయటపడ్డాయని స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.
మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈరోజు నమోదైన 50 కేసుల్లో 90శాతం కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిథిలోనివే కావడం బాధాకరం. ఈరోజు కరోనా కారణంగా ఎవ్వరూ చనిపోలేదని, పైగా రాష్ట్రవ్యాప్తంగా 68 మంది కోలుకున్నారని మంత్రి ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. కొత్తగా వెలుగుచూసిన కేసులతో కలుపుకొని తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 700కు చేరింది.
తెలంగాణలో నమోదైన 700 కేసుల్లో.. 645 కేసులు ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చినవాళ్లు, వాళ్లతో కాంటాక్ట్ లోకి వెళ్లిన వాళ్లవేనని మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రోగుల పరిస్థితి నిలకడగా ఉందని, గాంధీ హాస్పిటల్ లో మాత్రం ముగ్గురు వెంటిలేటర్ పై ఉన్నారని అన్నారు.
మరోవైపు కరోనా రోగుల కోసం గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కాంప్లెక్స్ ను పూర్తిగా కరోనా హాస్పిటల్ గా మార్చేశారు. అంతేకాదు.. దీన్ని 1500 పడకలకు అప్ గ్రేడ్ కూడా చేశారు. యుద్ధప్రాతిపదికన సిద్ధమైన ఈ హాస్పిటల్ ను ఈనెల 20న ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో 10 లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వైద్య పరికరాలు సమకూర్చుకునే విధంగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు.