కరోనా క్రైసిస్ ఎప్పటికి ముగుస్తాయనేది ఇప్పటి వరకూ అంచనాకు అందని విషయం. 28 రోజుల పాటు ఏదైనా ప్రాంతంలో కరోనా కేసేదీ నమోదు కాలేదంటే, అప్పటికి అక్కడ కరోనా మటుమాయం అయినట్టు అని ప్రభుత్వమే చెబుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే తక్కువ స్థాయిలోనే అయినా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మే 3 వరకూ లాక్ డౌన్. అప్పుడు ఏం చేస్తారు? అప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూ పోతే పరిస్థితి ఏమిటి? అనేవి అంతుబట్టని విషయాలు.
ఒకవేళ మే 3 నుంచి పాక్షికంగా లాక్ డౌన్ ను ఎత్తేసినా.. జనజీవనం ఎప్పటి నుంచి మళ్లీ పునరుత్తేజం అవుతుందనేది మాత్రం ఇప్పుడు క్లియర్ గా చెప్పలేని అంశం. ఇక సినిమాల సంగతి సరేసరి. లాక్ డౌన్ కన్నా ముందే థియేటర్లు మూతబడ్డాయి. బెంగళూరులో లాక్ డౌన్ కు వారం రోజుల ముందు నుంచినే థియేటర్స్, మాల్స్ ను మూసేశారు. కాబట్టి లాక్ డౌన్ ను ప్రభుత్వం ఎత్తేసినా… థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనేది మాత్రం మరింత మిస్టరీ.
ఆ సంగతలా ఉంటే.. తమిళ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాకు కొత్త డేట్ అనుకుంటున్నారట. అదే జూన్ 22. ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారట. వాస్తవానికి ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూన్ 22న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆ రోజు విజయ్ పుట్టిన రోజు. ఆ అవకాశాన్ని వదులుకోకూడదనేది ఈ సినిమా మేకర్ల ఆలోచన.
జూన్ 22 అంటే దానికి ఇంకా చాలా సమయమే ఉంది. రెండు నెలల మీద వారం వ్యవధి ఉంది ఆ తేదీకి. కాబట్టి.. ఆ లోపు పరిస్థితులు సద్దుమణిగితే, మళ్లీ జనాలు ధైర్యంగా థియేటర్లలోకి ఎంటరయ్యే పరిస్థితి వస్తుందనే ఆశాభావం ఈ సినిమా రూపకర్తల్లో కనిపిస్తోంది.