కరోనా విపత్తు వేళ తొలి విడత లాక్ డౌన్ ప్రకటించక ముందే.. ఈ-కామర్స్ సంస్థలను ప్రజలు పక్కనపెట్టారు. డెలివరీ బాయ్స్ తో పాటు, డెలివరీ అయ్యే వస్తువుల ద్వారా కూడా కరోనా సోకుతుందనే భయంతో చాలామంది ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఈ-కామర్స్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత మాత్రం ప్రజల ఆలోచనలో కొంత మార్పు వచ్చింది.
బహిరంగ మార్కెట్లలో వస్తువులు దొరక్కపోవడం, డిస్కౌంట్లు లేక ధరల్లో భారీ పెరుగుదల ఉండటంతో చాలామంది ఆన్ లైన్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. కొన్ని ప్రాంతాల్లో స్విగ్గీ, జొమాటో లను ప్రభుత్వ అధికారులే ప్రోత్సహించారు. అలాంటిది తాజాగా ఢిల్లీలో జరిగిన పిజ్జా డెలివరీ బాయ్ ఘటనతో మరోసారి అందరిలో అనుమానాలు మొలకెత్తాయి.
ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా సోకడంతో ఏకంగా 70 కుటుంబాలను క్వారంటైన్ కి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అసలు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఎంత వరకు సేఫ్ అనే విషయంపై ప్రజలు ఆలోచిస్తున్నారు. అటు అధికారులు కూడా ఈ ఆన్ లైన్ అమ్మకాలపై నిషేధాలు విధించే ఆలోచనలో ఉన్నారు.
అయితే దేశవ్యాప్తంగా రెండోసారి మే-3 వరకు లాక్ డౌన్ పొడిగించిన వేళ.. ఏప్రిల్ 20నుంచి కొన్ని సడలింపులు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. ఇందులో ఈ-కామర్స్ సంస్థల అమ్మకాలపై నిషేధం ఎత్తివేత కూడా ఉంది. కానీ ఢిల్లీ ఘటనతో ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తోందని సమాచారం. ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు.. ఇంటింటికీ చేరవేసే డెలివరీ బాయ్స్ ఆరోగ్యంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వారు ఇచ్చే వస్తువులను శానిటైజ్ చేసి తీసుకున్నా కూడా ప్యాకింగ్ సమయంలో వైరస్ అందులో చేరి ఉంటే అనే అనుమానం కూడా వినియోగదారుల్ని వెంటాడుతోంది.
దీంతో అసలు ఈ కామర్స్ సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపులో ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు చోటు ఉండకూడదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీంతో కేంద్రం కూడా ఈ-కామర్స్ సంస్థల విషయంలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకునే అవకాశముంది.