బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. రాత్రంతా నరకం చూసేలా చేసింది. లాకర్ గదిలో వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని పట్టించుకోకుండా సిబ్బంది బ్యాంక్ మూసేసి వెళ్లిపోయారు. దీంతో 18 గంటల పాటు నరకం అనుభవించాడు ఆ వృద్ధుడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
జూబ్లీహిల్స్ కు చెందిన 84 ఏళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి, లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఆయన బ్యాంకులోకి వెళ్లారు. ఆయన లాకర్ గదిలో ఉన్న విషయాన్ని సిబ్బంది పట్టించుకోలేదు. ఆ గది తలుపు మూసేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్యాంకు కూడా మూసేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
బయటకెళ్లిన పెద్దాయన ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలించి, కృష్ణారెడ్డి బ్యాంకులోకి వెళ్లిన విషయాన్ని గుర్తించారు. అనుమానం వచ్చి లాకర్ గది ఓపెన్ చేయగా, అందులో కృష్ణారెడ్డి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు.
ఆయనకు షుగర్ ఉంది. 18 గంటలుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతో నీరసంతో పడిపోయారు. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, బ్యాంక్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అటు బ్యాంక్ యాజమాన్యం కూడా జరిగిన ఘటనపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది.