బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్ను తెలుగు సినిమాలపై పడింది. పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమాలు రాణిస్తున్నాయని, ఇదే సమయంలో హిందీ సినిమాలు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నాయని అంటున్నాడు సల్మాన్ ఖాన్. తెలుగు సినిమాలు ఏ విషయంలో విజయం అవుతున్నాయో కూడా సల్మాన్ విశ్లేషిస్తున్నాడు.
హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ తెలుగు సినిమాలు పాన్ ఇండియా ప్రమోషన్ ను పొందుతున్నాయనేది సల్మాన్ విశ్లేషణ. హిందీలో కూడా అలా చేయాలన్నదే తన అభిప్రాయమట! హీరో క్యారెక్టర్ లార్జర్ దేన్ లైఫ్ తరహాలో ఉండాలని సల్మాన్ చెప్పుకొస్తున్నాడు. అలా ఉన్నప్పుడే ప్రేక్షకులను అవి ఆకట్టుకుంటాయట1 తెలుగు సినిమాలను అలానే రూపొందిస్తూ ఉన్నారని, అందుకే… అవి విజయవంతం అవుతున్నాయనేది సల్మాన్ విశ్లేషణ.
హిందీలో అలా జరగడం లేదట. తను పలు సార్లు అలాంటి ప్రయత్నమే చేసినా అవి విజయవంతం కాలేదని సల్మాన్ వాపోతున్నాడు. ఈ విషయంలో బాలీవుడ్ మూవీ మేకర్లు తెలుగు మూవీ మేకర్ల నుంచి స్ఫూర్తి పొందాలని సల్మాన్ చెబుతున్నాడు.
సలీమ్, జావేద్ లాంటి రచయిత యుగంలో బాలీవుడ్ దేశం మొత్తం మీదా ముద్రవేయగల ఎంటర్ టైనర్లను రూపొందించిందని, ఇప్పుడు అలా జరగడం లేదని సల్మాన్ ఖాన్ అంటున్నాడు. మొత్తానికి అతి హీరోయిజం, వాస్తవానికి పొంతనలేని క్యారెక్టరైజేషన్లతో తెలుగు సినిమాలు తెలుగు వారిని తలబొప్పి కట్టిస్తుంటే, వీటికి కలెక్షన్లు రావడం చూసి.. తామూ ఇలాంటి సినిమాలు చేయాలని తపిస్తున్నట్టుగా ఉన్నాడు! ఈ హీరో దక్షిణాది దర్శకులతో వరసగా సినిమాలు చేస్తూ ఉండటం, తెలుగు సినిమాల రీమేక్ లకు ప్రాధాన్యతను ఇస్తుండటం వెనుక అసలు కారణం ఆయనే ఇలా చెప్పుకున్నట్టుగా ఉన్నాడు.