అవకాశం వస్తే తెలుగు ప్రజలకు సేవ చేస్తానని లోక్‌సభ సభ్యురాలు, సినీ అందగత్తె నవనీత్ కౌర్ తెలిపారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే అతి చిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని చెప్పుకొచ్చారు. ఇటీవల బాంబే హైకోర్టు ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడం, అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
ఈ నేపథ్యంలో ఆమె కులధ్రువీకరణపై స్పందించారు. ఓటమిని తట్టుకోలేకే తనపై తప్పుడు కేసు వేశారని మండిపడ్డారు. తనకు అనుకూలంగా తీర్పు రావడంతో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు నవనీత్ కౌర్ వెల్లడించారు. తన పోరాటం శివసేనపై మాత్రమేనని స్పష్టం చేశారు. తన ప్రధాన ప్రత్యర్థి శివసేన అని తేల్చి చెప్పారు.
అవకాశం వస్తే తెలుగు ప్రజలకు సేవ చేస్తానని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. తెలుగు ప్రజల తరుపున లోకసభలో తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సాయం చేస్తానని ఆమె చెప్పారు.
మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు నవనీత్ కౌర్ తెలిపారు.