లోకేశ్ మంగళగిరిలో గెలిచినంత సంబరం టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఒకేసారి లోకేశ్ పాస్ అయినంత ఆనందం టీడీపీ నేతల్లో చూడొచ్చు. అందుకే టీడీపీ కార్యకర్తలు, నేతలు జెజ్జనక జెజ్జనక అంటూ చిందులు తొక్కుతున్నారు.
ఇక లోకేశ్‌ను మచ్చిక చేసుకునేందుకు, ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా లీకైన వీడియో పెంచిన గ్యాప్‌ను తగ్గించుకు నేందుకు ఇదే సరైన సమయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భావిస్తున్నారని సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలతో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా తమ యువకిశోరం, టీడీపీ భవిష్యత్ సారథి లోకేశ్ పోరాట ఫలితమే అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పరీక్షల రద్దు, విద్యార్థుల భవిష్యత్ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండు నెలలుగా అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన పోరాట ఫలితమే పరీక్షల రద్దు కారణమైందని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు
రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు మొండిగా ముందుకెళ్లిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ స్పష్టత రాలేదని అచ్చెన్నాయుడు అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే ఏమైనా సాధిస్తారని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎం జగన్ మాత్రం మూర్ఖంగా వ్యవహరించారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడం ఒక్క టీడీపీకే చెల్లింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశించికపోతే ఏపీ ప్రభుత్వం ఎలాగైనా పరీక్షలు నిర్వహించేదని అందరికీ తెలిసిన సత్యమే. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ విజయం ఏంటో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఈ మాత్రమైనా స్వీయ ఆనందం లేకపోతే లోకేశ్ ముందుకెళ్లలేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.