దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అనే ఒకే ఒక్క రాజకీయ నేత లేకపోవడం ఎంత లోటో ఏపీ ప్రజానీకానికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్ గొప్పతనాన్ని తెలంగాణ మంత్రులు తిట్ల రూపంలో చెబుతుండడం విశేషం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను తెలంగాణ మంత్రులు తిట్టిపోస్తున్నారు. తెలంగాణ నీటిని ఆంధ్రాకు ఎలా తీసుకెళ్లారో వాళ్ల తిట్లు వింటే చాలు తెలిసిపోతుంది.
తెలంగాణ దృష్టిలో వైఎస్సార్, ఆయన తనయుడు జగన్ చేసింది, చేస్తున్నది జలదోపిడీ అయితే, అదే ఆంధ్రులు మాత్రం హక్కును సాధించిన, సాధిస్తున్న నేతలుగా భావిస్తున్నారు. ఏపీకి నీటిని తీసుకొచ్చిన నేతలుగా కేవలం వాళ్లిద్దరికే క్రెడిట్ దక్కడం విశేషం. ఈ జలాలకు సంబంధించి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబునాయుడు పేరు ఎక్కడా వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి అసలు చంద్రబాబునాయుడు ఏపీ ప్రజానీకం కోసం ఏమీ చేయలేదని స్పష్టంగా అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా జలాల తరలింపు విషయంలో దివంగత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను రెండురోజుల క్రితం తెలంగాణ మంత్రి తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ్యతను మరో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీసుకున్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…
‘పోతిరెడ్డిపాడుకు డబుల్ దోపిడీ చేసేలా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. ఏపీతో మంచిగా ఉండాలనుకున్నా.. జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగు గంగ పేరుతో నీళ్లు తరలిస్తే.. ఇప్పుడు కృష్ణా బేసిన్ పరిధిలో లేని నెల్లూరుకు తీసుకెళ్తామనడం సరికాదు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదంటూ ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటోంది వాస్తవం కాదా? వైఎస్ హయాంలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యోగాల్లోనూ తీరని అన్యాయం జరిగింది’ అని విరుచుకుపడ్డారు.
దివంగత నేత వైఎస్సార్‌ను రోజూ తిడితే తిట్టారు కానీ, ఏపీ ప్రజానీకానికి మాత్రం ఆయన ఎన్ని గొప్ప పనులు చేశారో తెలంగాణ మంత్రులు చెబుతున్నట్టైంది. ఏపీ విభజనపై ఆ రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికీ బాధ పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జీవించి ఉంటే ఎప్పటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదని చెప్పడం ద్వారా …ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆయన లేని లోటు ఏంటో తెలంగాణ మంత్రులు చెప్పకనే చెప్పారు.
ఇదే సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి, వైఎస్సార్ సమకాలికుడైన నారా చంద్రబాబు నాయుడు జీవించే ఉన్నారు. మరి చంద్రబాబును తెలంగాణ మంత్రులు ఎందుకని ఒక్క మాట కూడా అనడం లేదనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చి సహకరించారని పరోక్షంగా తెలంగాణ మంత్రులు చెబుతుండడం గమనార్హం. ఏ విధంగా చూసినా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే చేశారని తెలంగాణ మంత్రుల ఆగ్రహావేశాలే తెలియజేస్తున్నాయి.