2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు పవన్ కల్యాణ్. అందులో గాజువాక ఒకటి. ప్రత్యేకంగా ఆ నియోజకవర్గం కోసమే జనసేన మేనిఫెస్టో విడుదల చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో గాజువాక అంటే పవన్ కల్యాణ్ కు ఓ రకమైన విరక్తి వచ్చేసింది.
అసలు కోస్తాతో పెట్టుకుంటే పని జరగదని, సీమకు షిఫ్టవ్వాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం రాయలసీమలో నియోజకవర్గం వెదుక్కునే పనిలో పడ్డారు పవన్. సరిగ్గా ఈ సమయంలోనే గాజువాక పవన్ భక్తుల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు ఎక్కువయ్యాయి.
ఉండిపోండి.. ప్లీజ్..
పవన్ కల్యాణ్ నియోజకవర్గం మారుస్తారనే ఆలోచనలో ఉన్నట్టు తెలియడంతో ఆ ప్రాంత జనసైనికులు, పవన్ అభిమానుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
పవన్ గాజువాకలోనే మరోసారి పోటీ చేయాలని, ఈసారి కచ్చితంగా గెలిపిస్తామని అంటున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే తాము ప్రణాళికలు వేసుకున్నామని, చాలా కష్టపడుతున్నామని, గాజువాకలో ఈసారి పవన్ కు గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అంటున్నారు.
గత ఎన్నికల్లో స్థానిక రాజకీయాలు, లోకల్ వెన్నుపోట్ల వల్ల పవన్ ను గెలిపించుకోలేకపోయామని, ఈసారి మాత్రం కచ్చితంగా గెలిపించుకుంటామని నమ్మకంగా చెబుతున్నారు.
ఉండకపోతే బాగోదు.. జాగ్రత్త..
మరో వర్గం కాస్త వయలెంట్ గా మారింది. ఈ బాపతు అభిమానులు, కార్యకర్తలు ఏకంగా బెదిరింపుల వరకు వెళ్లారు. పవన్ కల్యాణ్ గాజువాకను ఖాళీ చేస్తే, తాము రాజకీయాలు వదిలేస్తామని, జనసేన నుంచి బయటకు వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు.
పవన్ గెలుపు కోసం తాము రెండేళ్లుగా కష్టపడుతున్నామని, ఆయన చోటు మారిస్తే, తాము జెండా మార్చేస్తామని చెబుతున్నారు. ఎక్కడి జెండాలక్కడ పడేస్తామని అంటున్నారు. పవన్ కాకుండా మరో అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసినా, తాము సహకరించేది లేదంటున్నారు. ఒంటినిండా పవనిజాన్ని నింపుకున్న రెబల్ బ్యాచ్ ఇలా వార్నింగ్ లు ఇస్తోంది.
ఇంతకీ పవన్ మదిలో ఏముందో..?
పవన్ కల్యాణ్ మాత్రం ఈసారి గాజువాక, భీమవరం రెండు చోట్లా పోటీ చేసే ఉద్దేశంలో లేదనే విషయం ఈపాటికే స్పష్టమైంది. ఆ ఆలోచనే ఉంటే కనీసం ఆయా నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటన చేసి వచ్చేవారు. కనీసం పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రచించేవారు.
లోకల్ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించి, పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చేవారు. కానీ పవన్ అవేవీ చేయలేదు. అసలు అక్కడ పార్టీ గురించి ఆలోచనే చేయట్లేదు. దాదాపుగా నియోజకవర్గం మార్చేందుకే పవన్ ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మరి గాజువాక బ్యాచ్ డిమాండ్లకు పవన్ ఎలాసర్దిచెబుతారో చూడాలి.