ఏపీలో పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. గతంలో కోర్టు తీర్పు మేరకే పరిషత్ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల ప్రచారానికి తగిన సమయం ఇవ్వలేదంటూ మొత్తం ఎన్నికలనే రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సంచలనం రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఎస్ఈసీ తరపు న్యాయవాది న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు.
బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాల్సి ఉందని, కావున ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఇప్పట్లో ఎక్కడా ఎన్నికలు లేవు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు రద్దు చేయాలన్న సింగ్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం జూలై 27న సమగ్ర విచారణ జరుపుతామని అప్పటి వరకూ కేసును వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పరిషత్ ఎన్నికలు, ఓట్ల లెక్కింపుపై మరికొంత కాలం ఉత్కంఠ తప్పదు.