ఇప్పుడే నాన్ లోక‌ల్ ప్ర‌స్తావ‌న ఎందుకు?- ప్ర‌కాశ్‌రాజ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల స్థానిక‌త‌పై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ పోటీ…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల స్థానిక‌త‌పై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ పోటీ చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది. స‌హ‌జంగా బీజేపీ సిద్ధాంతాల‌ను, మోదీ పాల‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే ప్ర‌కాశ్‌రాజ్ …స‌హ‌జంగానే ‘మా’లో త‌ల‌ప‌డ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. త‌న ప్యాన‌ల్‌ను గురువారం ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న మార్క్ పంచ్ డైలాగ్‌ల‌తో అట్రాక్ట్ చేసుకున్నారు. త‌మ ప్యానల్‌కు ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించిన తీరు డిఫ‌రెంట్‌గా ఉంది. మీడియా స‌మావేశంలో ఆయ‌న ఏం మాట్లాడారో ప్ర‌కాశ్‌రాజ్ మాట ల్లోనే…  ‘నాలుగైదు రోజుల నుంచి మీడియాలో వస్తోన్న ఊహాగానాలు చూస్తుంటే కొంచెం భయం వేసింది. 

‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ కొన్నిచోట్ల వార్తలు వచ్చాయి. ‘మా’లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. మాది సినిమా బిడ్డల ప్యానల్‌. పదవీ కోసం మేము పోటీ చేయడం లేదు.

పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. నా ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్లే. ఆఖరికి తప్పు చేస్తే నన్ను కూడా వాళ్లు ప్రశ్నిస్తారు. ఆ అర్హత వాళ్లకు ఉంది. ఇటీవ‌ల కాలంలో నేను ఎక్కువగా లోకల్‌, నాన్‌లోకల్‌ అని వింటున్నాను. కళాకారులు లోకల్‌ కాదు యూని వర్సల్‌.  

భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇదేం అజెండా. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు.

తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం.  నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. 

ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

‘మా’ అధ్య‌క్ష బ‌రిలో న‌లుగురు నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్‌, జీవిత‌, హేమ పోటీదారుల్లో ఉన్నారు. దీంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కానీ ఎంతో ముందుగానే ప్యాన‌ల్స్‌ను కూడా సిద్ధం చేసుకుని ప్ర‌చారానికి కూడా సిద్ధం కావ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది.