పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు పూర్తి స్థాయిలో వారికి ఉపయోగపడిన దాఖలాలు ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేవు. ఏపీ విషయానికొస్తే.. ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఊరి చివర ఉండటంతో ఎవరూ అక్కడ కాపురాలు పెట్టలేదు. ఆ తర్వాత రాజీవ్ స్వగృహ పేరుతో నిర్మించిన అపార్ట్ మెంట్లు నిర్వహణ సరిగా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన టిడ్కో ఇళ్లు.. బాబు జేబు సంస్థలు నింపి, నాసిరకంగా తయారయ్యాయి.
ఇక ఇప్పుడు జగన్ జమానా. ఇక్కడ జగనన్న కాలనీలు అనే పేరుతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం మొదలైంది. ముందు ఉచితంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న జగన్, ఆ తర్వాత ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా మొదలయ్యాయి జగనన్న కాలనీలు.
ప్రతిపక్షాలు కోర్టు కేసుల్తో అడ్డు తగలడంతో ఇళ్ల స్థలాల కేటాయింపు కాస్త ఆలస్యంగా పూర్తయింది. ఇటీవలే ప్లాట్లు కూడా కేటాయించేశారు. ప్రస్తుతం ప్రభుత్వ అంచనా ప్రకారం 3.03లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. జులై నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది. జూన్ 2022నాటికి గృహప్రవేశాలు చేయించాలనేది జగన్ ఆలోచన. అంతా బాగానే ఉంది కానీ అనుకున్న సమయానికి ఇళ్లు పూర్తవడంతో పాటు, అవి నివాసయోగ్యంగా ఉన్న కాలనీలు అనిపించుకోవడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు.
కాలనీలపై జగన్ ఆలోచన విధానం ఇది
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, కట్టించిన ఇళ్లు అంటే.. కచ్చితంగా అవి నాసిరకంగా ఉంటాయనేది ఇప్పటి వరకూ ఉన్న నమ్మకం. కానీ తొలిసారిగా జగన్ ఆ ఆలోచన చెరిపేయాలనుకుంటున్నారు. పేదలకు కట్టించే ఇళ్లు పూర్తి క్వాలిటీలో ఉండాలని, అదే సమయంలో ఆ కాలనీలకు మురికివాడలు అనే పేరు పడకుండా ఉండాలనేది ఆయన తాపత్రయం. దానికి అనుగుణంగానే కేవలం మౌలిక వసతుల కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కేంద్రం పథకాలను కూడా ఇందులో వినియోగించుకుంటూ ముందుకు పోతున్నారు.
ప్రతి ఊరిలోని జగనన్న కాలనీలో మంచినీటి కుళాయి సౌకర్యం, లైబ్రరీ, మార్కెట్, అవసరమైన చోట్ల సచివాలయ భవనం.. ఇలా అన్నీ అందుబాటులోకి తెస్తామంటున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని బ్యాంకుల వద్ద లోన్లు ఇప్పిస్తోంది కాబట్టి, పేదలు ఇళ్లు కట్టుకోడానికి ముందుకొస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జగనన్న కాలనీలే రాబోయే రోజుల్లో జగన్ కి శ్రీరామరక్షగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
జానెడు ఇంటి స్థలం పేదలకు గొప్ప ఆస్తి. ఆ ఆస్తిని ఇవ్వడంతో పాటు ఉండటానికి ఇల్లు కూడా కట్టించి, మంచి పరిసరాలు కూడా ఇవ్వడం, సౌకర్యాలు కల్పించడం అంటే మాటలు కాదు. దాన్ని సుసాధ్యం చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ చరిత్రలో ప్రజలు చూడని కొత్త కాలనీలను పరిచయం చేస్తానంటున్నారు జగన్. అదే జరిగితే.. దేశానికే ఇది ఆదర్శవంతమైన పథకం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.