పెద్ద మనుషులంతా కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను స్థాపించినప్పుడు, దాదాపు 27 ఏళ్ల కిందటే ఓ మాట అనుకున్నారు. ప్యానెల్ లో ఎవరున్నా, ఉండకపోయినా అధ్యక్ష పదవి మాత్రం ఏకగ్రీవం అవ్వాలనేది ఆ ఒప్పందం. ఇది ఎక్కడా మినిట్స్ లో రాసుకోలేదు, రూల్స్ కూడా లేదు. ఓ రకమైన పెద్ద మనుషుల ఒప్పందం లాంటిదన్నమాట.
చాన్నాళ్ల పాటు ఈ కట్టుబాటు బాగానే నడిచింది. మురళీమోహన్ నుంచి చాలామంది ప్రముఖులు 'మా' అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయంలో క్రెడిట్ అంతా దాసరి నారాయణరావుకు ఇవ్వాల్సిందే. ఆయన ఉన్నప్పుడు ''ఒకే మాట-ఒకే బాట'' అన్నట్టుండేది. 'మా' అనేది జెంటిల్మేన్స్ అసోసియేషన్ లా కొనసాగింది. బయట జనాల్లో, మీడియాలో కూడా 'మా'కు ఓ గౌరవం ఉండేది.
ఎప్పుడైతే దాసరి ఈ లోకాన్ని వీడి వెళ్లారో అప్పట్నుంచే, ఏకగ్రీవం అనే కట్టుబాటు కూడా దాదాపు అప్పుడే కనుమరుగైంది. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకునే ఆలోచనకు ఆశాభంగం ఎదురైంది. ఆ తర్వాత ఏకగ్రీవం అనే పదమే అంతరించిపోయింది. 'మా' ఎన్నికలు, రాజకీయ ఎన్నికల్లా మారిపోయాయి. మాటల తూటాలు, వ్యక్తిగత విమర్శలు, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడాలు కామన్ అయిపోయాయి. పనిలోపనిగా 'మా'లో కుంభకోణాలు కూడా బయటపడ్డాయి.
ఇప్పుడీ 'మా' రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. మొన్నటివరకు ద్విముఖ పోటీగా ఉన్న వ్యవహారం కాస్తా ఇప్పుడు నాలుగు స్తంభాలాటగా మారింది. మొన్నటివరకు రెండు గ్రూపులు మాత్రమే అనుకున్న బహిరంగ రహస్యం కాస్తా, ఇప్పుడు పలు రకాల గ్రూపులుగా మారి పబ్లిక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బజారున పడింది.
ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయాలనుకున్నారు. సిని'మా' బిడ్డలు అంటూ తన ప్యాలెన్ ను కూడా ఆయన ప్రకటించారు. ఆ వెంటనే మంచు విష్ణు రంగంలోకి దిగాడు. అధ్యక్ష బరిలో ఉన్నానంటూ ప్రకటించుకున్నాడు. తండ్రి మోహన్ బాబుతో కలిసి సుడిగాలి పర్యటనలు కూడా మొదలుపెట్టాడు.
అంతలోనే నటి హేమ, జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉన్నట్టు ప్రకటించి మంట రగిల్చారు. వీళ్లలో ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ అండదండలున్నాయి. నాగబాబు బాహాటంగా మద్దతివ్వడంతో ఈ విషయం పక్కా అయింది. ఇక మంచు విష్ణుకు కృష్ణ కుటుంబం సపోర్ట్ ఉంది. మోహన్ బాబు-విష్ణు వెళ్లి కృష్ణను కలవడం వల్ల ఈ మద్దతు రాలేదు.
తెరవెనక నుంచి సీనియర్ నరేష్ సపోర్ట్ వల్ల కృష్ణ-మహేష్ మద్దతు విష్ణుకు దొరికినట్టయింది. ఇక జీవిత రాజశేఖర్ ను బాలకృష్ణ వెనక నుంచి ఎగదోస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటివరకు అసోసియేషన్ కు దూరంగా ఉన్న బాలయ్య ఈసారి ఇలా పరోక్షంగా బరిలో దిగడం ఆసక్తికరం.
ఇక ఎన్నికల్లో ఓట్లు చీల్చడం కోసం, మరికొంతమంది ప్రముఖులు తెరవెనక నుంచి హేమను బరిలో దించారనే ప్రచారాన్ని కూడా కొట్టిపారేయలేం. పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి, రాత్రికిరాత్రి హేమ మనసు మార్చుకోవడం వెనక మతలబు ఏంటో మరీ ఊహకందని విషయమైతే కాదు.
ఇలా నాలుగు గ్రూపులు, పలు రకాల రాజకీయాలతో రంజుగా మారిపోయిన 'మా'లో ఏకగ్రీవం గురించి మాట్లాడ్డం పెద్ద జోక్ అవుతుంది. కానీ ఇప్పుడున్న కంపు పరిస్థితుల్లో ఒకప్పటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ఏకగ్రీవం అంశాన్ని గుర్తుచేయడం ఎంతో అవసరం.
జస్ట్ ఏడాది కిందట కూడా ఏకగ్రీవంపై మురళీమోహన్, జయసుధ లాంటి వ్యక్తులు కామెంట్స్ చేశారు. అంతా కలిసి అధ్యక్షుడ్ని ఏకగ్రీవం చేసి అసోసియేషన్ హుందాతనం నిలబెట్టాలని అన్నారు. మరీ ఇబ్బందైతే ఒక విడత పురుషుడికి, మరో విడత మహిళకు అవకాశం ఇస్తూ ఏకగ్రీవాన్ని కొనసాగించాలని కూడా మధ్యేమార్గాన్ని సూచించారు.
దీనికి చిరంజీవి, కృష్ణంరాజు లాంటి పెద్ద హీరోలు మద్దతు కూడా ఇచ్చారు. కానీ అవన్నీ ఇప్పుడు హుష్ కాకి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఇప్పుడు చిరంజీవి మాటకు కూడా 'మా'లో విలువ లేదు.
దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో చిరంజీవి దాదాపు సక్సెస్ అవుతున్నప్పటికీ.. 'మా' విషయంలో ఆయనకు ఇంకా పూర్తి ఆధిపత్యం రాలేదు. భవిష్యత్తులో ఆ పట్టు వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ప్రస్తుతం కళ్లముందు కనిపిస్తున్న 4 గ్రూపులే దీనికి సజీవ సాక్ష్యం.
ఇలాంటి టైమ్ లో అసోసియేషన్ లో ఏకగ్రీవం కోరుకుంటే అది ఒట్టి భ్రమే అవుతుంది. భవిష్యత్తులో కూడా 'మా' ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగాలంటే బహుశా దాసరి మళ్లీ పుట్టాలేమో.