ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు విషయంలో ఎవరిది విజయం? ఎవరిది పరాజయం?? అసలు జయాపజయాలతో సంబంధం ఉన్న సబ్జెక్టే కాదిది. కానీ కొంతమంది దీన్ని లోకేష్ విజయంగా భజన మొదలు పెట్టారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన లోకేష్, కేవలం ట్విట్టర్ ద్వారా ఒత్తిడి తెచ్చి పరీక్షలు ఆపివేయించి వైసీపీ ప్రభుత్వంపై ఘన విజయం సాధించారట. ఈమేరకు లోకేష్ చిత్రపటానికి విజయవాడలో విద్యార్థులతో పాలాభిషేకాలు, జింబాదాద్ లు. విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంటాయి ఇలాంటి వ్యవహారాలు. ఆమధ్య పోలవరం వద్ద జయము జయము చంద్రన్నా అంటూ సాగిన భజనా కాలక్షేపం కంటే.. ఇక్కడ లోకేష్ పాలాభిషేకాలే మరింత ఇబ్బందికరంగా ఉన్నాయి.
చివరి వరకూ ప్రయత్నం..
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చివరికంటూ ప్రయత్నించింది. సుప్రీంకోర్టు ఎక్కడా పరీక్షల నిర్వహణను, దానికోసం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టలేదు.
జులై 31లోగా పరీక్షలు ముగించి, ఫలితాలు ప్రకటించాలని, అలా చేయగలిగితేనే వచ్చే విద్యా సంవత్సరం విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ సారూప్యత ఉంటుందని సూచించింది. పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో మరిన్నిరోజులు పరీక్షలు పెట్టడానికి వేచి చూస్తే విద్యాసంవత్సరం మరింత ఆలస్యం అవుతుందని హెచ్చరించింది. జులై 31 డెడ్ లైన్ విధించింది.
అయితే ఈలోగా పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం, ఇతర కసరత్తులు చేయడం, అన్నిటికీ మించి పరీక్షల తర్వాత మూల్యాంకనం, ఫలితాలు ప్రకటించడం అన్నీ తలకు మించిన భారాలే. అందుకే ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది.
కోర్టు సూచనలతోనే..
తెలంగాణలో జులై 1 నుంచి స్కూల్స్ మొదలవుతున్నాయి. 9, 10 తరగతుల విద్యార్థులు ఏకంగా రోజూ స్కూల్స్ కి వెళ్లి బెంచీలలో పక్క పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి. అలాంటిది ఏపీలో జులై సెకండాఫ్ లో విద్యార్థులు రోజు మార్చి రోజు పరీక్షలకు హాజరై కేవలం 3గంటలు ఎగ్జామ్ హాల్ లో కూర్చుని వెళ్తే ఏమవుతుంది? లాజిక్ లు పక్కనపెట్టినా కోర్టు ఆదేశాలు ముఖ్యం కాబట్టి, జగన్ సర్కారు సుప్రీం సూచనలు పరిగణలోకి తీసుకుని పరీక్షల్ని రద్దు చేసింది.
మరిక్కడ లోకేష్ గొప్పదనం ఏంటి, కొన్నాళ్లుగా ఆయన పరీక్షల రద్దు కోసం ప్రయత్నించి ఉండొచ్చు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఉండొచ్చు. అంతమాత్రాన పరీక్షల రద్దు అనేది లోకేష్ సాధించిన విజయంగా మారిపోతుందా? అసలిది సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన సమయమేనా?
టీడీపీ అల్ప సంతోషం..
కోర్టుల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే దాన్ని టీడీపీ విజయంగా చెప్పుకోవడం ఆ పార్టీకి ఆనవాయితీగా మారింది. కోర్టు సూచనల్ని కూడా చంద్రబాబు సూచనల్లాగా పరిగణిస్తుంటారు ఆ పార్టీ కార్యకర్తలు, ఎల్లో మీడియా జనాలు.
ఈ దశలో సుప్రీంకోర్టు సూచనలను కూడా టీడీపీ లోకేష్ ఖాతాలో జమచేసి అల్పసంతోషం పొందుతోంది. నేరుగా ఎన్నికల్లో గెలిచే సంతోషం ఎలాగూ లోకేష్ కి లేదు కాబట్టి, ఇలాంటి చీప్ ట్రిక్స్ తో చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయింకుంటోంది పచ్చబ్యాచ్.
భవిష్యత్తులో తిట్లు తినేది లోకేష్ మాత్రమే
అయితే ఇదంతా తాత్కాలికం అనే విషయాన్ని లోకేష్ గ్రహించలేకపోతున్నారు. చదవకుండా పాస్ అయిపోవడం కొంతమంది విద్యార్థులకు ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది.
కానీ భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ప్రయత్నించే టైమ్ లో ఈ ''కరోనా పాస్'' సర్టిఫికేట్ వాళ్లకు ప్రతిబంధకంగా మారడం ఖాయం. పరీక్షల నిర్వహణ కోసం జగన్ చేసిన ప్రయత్నాల్ని అప్పుడు అంతా మెచ్చుకుంటారు. అదే టైమ్ లో లోకేష్ ను తిట్టుకుంటారు.