సంగం డెయిరీ కేసులో జగన్ సర్కార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు, సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ముకుతాడు వేసింది. రాజకీయంగా ధూళిపాళ్ల నరేంద్రను ఇరుకున పెట్టాలనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ) పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సంగం డెయిరీ యాజమాన్యాన్ని రాత్రికి రాత్రి మారుస్తూ, స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో జగన్ సర్కార్ చెంప చెళ్లుమనిపించినట్టైంది.
సంగం డెయిరీపై డైరెక్టర్లదే ఆధిపత్యం అని హైకోర్టు తేల్చి చెప్పింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ ఆస్తుల క్రయవిక్రయాలకు మాత్రం కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ధూళిపాళ్ల నరేంద్రకు గొప్ప ఊరట లభించినట్టే.
గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని దాని చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ) పరిధిలోకి సంగం డెయిరీని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. డెయిరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది.
అలాగే డెయిరీ నిర్వహణ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ… 1978 జులై 17న ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
నిత్యావసరాల సరఫరా, డెయిరీ ఆస్తుల రక్షణకు 3 నెలల కాలానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్త ర్వులు జారీ చేసిన సంగతి తెలసిందే. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందాన తయా రయ్యాయి.