బాలీవుడ్ కెళ్లి ఓ హిందీ సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. టాలీవుడ్ నుంచి కొంతమంది ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. హీరో నానికి కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఉంది. తన మనసులో మాటను బయటపెట్టిన ఈ హీరో.. బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూనే, కొన్ని సమస్యల్ని కూడా బయటపెట్టాడు.
“మంచి బాలీవుడ్ ప్రాజెక్టు తగిలితే కచ్చితంగా ఆలోచిస్తాను. ఫిలిం మేకర్ లేదా కథ దొరికితే, చేయాలా వద్దా అని ఆలోచించను. ఎందుకంటే అది బాలీవుడ్ మూవీ కాబట్టి. కాకపోతే ఒకటే సమస్య. అదేంటంటే.. మనం పోషించే పాత్రకు భాష అడ్డురాకూడదు. నేను హిందీ మాట్లాడగలను. కానీ హిందీ సినిమాలో ఓ పాత్ర పోషించడానికి అది సరిపోదు.
కాబట్టి హిందీలో నాకు ఏదైనా స్టోరీ నచ్చిందంటే.. అది ఎలా ఉండాలంటే.. ఆ పాత్ర కోసం కష్టపడి హిందీపై పట్టు సాధించాలని నాకు అనిపించాలి. నేను బాలీవుడ్ కు కొత్త అనే ఫీలింగ్ ఆడియన్స్ కు రాకూడదు. ఆ రేంజ్ లో నన్ను ఎగ్జయిట్ చేసే స్క్రిప్ట్ దొరికితే బాలీవుడ్ లో నటించడానికి నేను రెడీ.”
నాని నటించిన V సినిమా గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో నేరుగా రిలీజైంది. ఇప్పుడా సినిమా హిందీలోకి కూడా డబ్ అవ్వబోతోంది. బహుశా ఈ సినిమాకొచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాని, తన బాలీవుడ్ ప్లాన్స్ కు మరింత మెరుగులు దిద్దుతాడేమో చూడాలి.
టక్ జగదీశ్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని తెలిపాడు నాని.