మన దేశంలో అమ్మాయిల వివాహ వయసును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో యువతుల కనీస వివాహ వయసు ప్రతిపాదనను ఆమోదించారు.
యువతుల వివాహ వయసు పెంచుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తానిచ్చిన మాటకు కట్టుబడి, ఆ దిశగా ఆచరణకు దిగారు.
అబ్బాయిల వివాహ వయసు 21, అమ్మాయిలకు 18 ఏళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చిన్న వయసులో అమ్మా యిలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది.
ఇందులో భాగంగా జయ జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ అమ్మాయిల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. స్త్రీలకు మొదటి గర్భధారణ సమయంలో కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ చెప్పింది.
అంతేకాకుండా తమ ప్రభుత్వం ఆడబిడ్డల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ తీసుకుంటుందని ప్రధాని పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అమ్మాయిల వివాహ కనీస వయసు పెంచేందుకు మోడీ సర్కార్ ముందడుగు వేసింది.