సినిమాపై మ‌ళ్లీ ప్ర‌భుత్వ పెత్త‌నం?

సినిమా టికెట్ల పెంపు పెత్త‌నం మ‌రోసారి ప్ర‌భుత్వం చేతిలోకి వెళ్లిందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆదేశాలు ఆ విధ‌మైన అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయ‌ని చెప్పొచ్చు. సినిమా టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం…

సినిమా టికెట్ల పెంపు పెత్త‌నం మ‌రోసారి ప్ర‌భుత్వం చేతిలోకి వెళ్లిందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆదేశాలు ఆ విధ‌మైన అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయ‌ని చెప్పొచ్చు. సినిమా టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. 

సినిమా టికెట్ల పెంపును క‌ట్ట‌డి చేస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 35ను ఇటీవ‌ల హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ప్ర‌భుత్వానికి చుక్కెదురైంద‌ని, త‌మ ఇష్టానుసారం టికెట్ల రేట్ల‌ను పెంచుకునే వెస‌లుబాటు థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు ల‌భించింద‌నే సంతోషం ఎంతోకాలం నిల‌వ‌లేదు.

సింగిల్ బెంచ్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లింది. ఈ పిటిష‌న్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా, జ‌స్టిస్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌మూర్తితో కూడిన ధ‌ర్మాస‌నం గురువారం విచార‌ణ చేప‌ట్టింది. టికెట్ల ధ‌ర‌ల పెంపు స్వేచ్ఛ‌ను థియేట‌ర్ యాజ‌మాన్యాలకు ఇస్తే సామాన్యులపై భారం ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేప‌థ్యంలో డివిజ‌న్ బెంచ్ కీల‌క ఆదేశాలు ఇచ్చింది. టికెట్ల ధ‌ర‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (జేసీ) ముందు పెట్టాల‌ని ఆదేశించింది. ధ‌ర‌ల‌పై జేసీయే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వం కూడా టికెట్ ధ‌ర‌ల‌పై ఓ క‌మిటీని వేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. 

దీంతో మ‌రోసారి ప్ర‌భుత్వ ఆధీనంలోకే టికెట్ల పెంపు వెళ్లింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే థియేట‌ర్ల యాజ‌మాన్యాలు టికెట్ల ధ‌ర‌ల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంప‌డం ద్వారా బ్లాక్ టికెట్ల దందాకు అడ్డుక‌ట్ట వేయొచ్చు. ప్ర‌భుత్వం కూడా ఇదే కోరుకుంటోంది. డివిజ‌న్ బెంచ్ తాజా ఆదేశాలు థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు ఒకింత షాక్ అని చెప్పొచ్చు.