ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో గండికోట ప్రాజెక్ట్ ముంపు వాసుల పరిహారం వైసీపీలో చిచ్చు రేపింది. ఈ చిచ్చు ఒకరి హత్యకు దారి తీసింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం పెంజి అనంతపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హతుడు ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి అనుచరుడు.
పి.అనంతపురంలో ముంపు పరిహార జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని జిల్లా రెవెన్యూ అధికారులకు గ్రామస్తుల్లో కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హరికిరణ్ ఇద్దరు తహశీల్దార్లను రీసర్వేకు ఆదేశించారు.
ఆ ఇద్దరు తహశీల్దార్ల ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే పరిహారం అందకుండా కావాలనే కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారని వైసీపీలోని మరో వర్గం ఆగ్రహంగా ఉంది.
ఇదే సమయంలో గ్రామసభ మొదలైంది. దీంతో అధికారులకు కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో ఘర్షణకు దిగారు.
ఈ ఘర్షణలో ప్రత్యర్థుల చేతిలో గురునాథరెడ్డి (41) అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇతను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుడు. గురునాథరెడ్డి హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కూడా ఈ గ్రామంలో గొడవలున్నాయని సమాచారం. అయితే గ్రామసభకు పోలీసులు వెళ్లక పోవడంపై విమర్శలొస్తున్నాయి. అసలు గ్రామసభ విషయమై పోలీసులకు అధికారులు సమాచారం ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చినా రాలేదా? అనేది తేలాల్సి ఉంది.