జగన్ ది వ్యూహమా.. పంతమా..?

దుబ్బాక షాకిచ్చినా జీహెచ్ఎంసీ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్. ఏమాత్రం తగ్గేది లేదంటూ ఎన్నికలకు సై అంటూ సవాళ్లు విసురుతోంది. మరి ఏపీలో అధికార పార్టీ వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి…

దుబ్బాక షాకిచ్చినా జీహెచ్ఎంసీ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్. ఏమాత్రం తగ్గేది లేదంటూ ఎన్నికలకు సై అంటూ సవాళ్లు విసురుతోంది. మరి ఏపీలో అధికార పార్టీ వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి వెనకాడుతోంది. 

వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ కి ఉన్న ఇబ్బందులు కూడా ఏపీలో జగన్ కి లేవు. అక్కడ ప్రతిపక్షాలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి, ఎంఐఎం కూడా బలం పుంజుకోవాలని చూస్తోంది.

ఇక్కడ టీడీపీ రోజురోజుకీ పాతాళానికి పడిపోతోంది. జనసేన-బీజేపీకి సంస్థాగత బలం లేదు. సో.. కేసీఆర్ కంటే జగన్ ఎక్కువ ధైర్యంతో ఉండాలి. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఊదిపారేస్తామనే లెవల్లో ఉండాలి. కానీ జగన్ మాత్రం ఎందుకో ఆలోచనలో ఉన్నారు. అది వ్యూహమా? లేక నిమ్మగడ్డపై పంతమా? అనేది మాత్రం సొంత పార్టీ నేతలకే అర్థం కావడంలేదు.

కొవిడ్ కు ముందు మొదలైన స్థానిక ఎన్నికల సమరంలో అప్పటికే.. భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటిలో కూడా పోటీ నామమాత్రం. 

పొరపాటున అసంతృప్తులు, తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కడైనా గెలిచినా కూడా తిరిగి వెంటనే సొంత గూటికి వచ్చేస్తారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి 85 శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా.అయితే నిమ్మగడ్డ చేసిన రాజకీయం వల్ల సజావుగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. 

కొవిడ్ కేసులు అప్పుడప్పుడే మొదలవుతున్న దశలో.. రోజుల వ్యవధిలో ముగిసిపోవాల్సిన ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. వాయిదా సమయంలోనే ఐఏఎస్, ఐపీఎస్ లపై బదిలీ వేటు కూడా వేశారు.

అయితే ప్రభుత్వం బదిలీల వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఏకంగా నిమ్మగడ్డపైనే వేటు వేసింది. చివరకు కోర్టుల జోక్యంతో కొత్త ఎస్ఈసీ నియామకం చెల్లుబాటు కాకపోవడంతో తిరిగి తన పదవిలోకి వచ్చారు నిమ్మగడ్డ. వస్తూ వస్తూనే స్థానిక ఎన్నికలకు ఉత్సాహం చూపించారు. అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టారు. 

అదే సమయంలో ప్రభుత్వంతో మాత్రం ఆయన గొడవ తెగలేదు. ఎన్నికల కమిషన్ నిధుల విషయంలో కోర్టులో పంచాయతీ పెట్టారు. ఇలా ప్రతి దానికీ ప్రభుత్వంతో పేచీ పడుతున్న నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలకు వెళ్లడం వైసీపీకి అస్సలు ఇష్టంలేదు. 

అందుకే మంత్రులు ఈ వ్యవహారంపై కుండబద్దలు కొట్టారు. స్థానిక ఎన్నికల విషయం ఎత్తితే చాలు.. నిమ్మగడ్డ చంద్రబాబు ఏజెంట్ అంటూ విరుచుకుపడుతున్నారు. చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ కూడా ముందు రోజే ఈనాడు వంటి చంద్రబాబు అనుకూల మీడియాకు లీక్ కావడం ఊహించని పరిణామం.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికలకు సై అంటే, దాన్ని తమ విజయంగా, నిమ్మగడ్డ విజయంగా టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది. అందుకే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ జగన్ నో చెబుతున్నారు.

గెలుపు కోసం కాకుండా, గొడవల కోసం చూస్తున్న టీడీపీకి అవకాశం ఇవ్వడానికి జగన్ ఇష్టంగా లేరు. అందుకే గెలుపు ధీమా ఉన్నా కూడా జగన్ స్థానిక ఎన్నికల విషయంలో అయిష్టంగానే ఉన్నారు. నిమ్మగడ్డ దిగిపోయాక ప్రశాంతంగా ఎన్నికలు జరపాలనే ఆలోచన చేస్తున్నారు. మార్చి నెలతో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుంది.

యూట్యూబ్ రిపోర్టర్ల పరిస్థితి ఏంటి..?