అఖిల కిల‌కిల‌…ప్ర‌త్య‌ర్థులు వెల‌వెల‌

రాష్ట్రంలోని 12 జిల్లాలు ఒక ఎత్తైతే, కర్నూలు జిల్లాలో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి నెల‌కొంది. రాష్ట్ర‌మంతా టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని నెత్తీనోరూ కొట్టుకుంటుంటే …. క‌ర్నూలు జిల్లాలో…

రాష్ట్రంలోని 12 జిల్లాలు ఒక ఎత్తైతే, కర్నూలు జిల్లాలో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి నెల‌కొంది. రాష్ట్ర‌మంతా టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని నెత్తీనోరూ కొట్టుకుంటుంటే …. క‌ర్నూలు జిల్లాలో మాత్రం మాజీమంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ మాత్రం పోలీసులను ఒక్క మాట కూడా అన‌రు. క‌ర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి చూస్తుంటే …ఇంత‌కూ వాళ్లు అధికార పార్టీలో ఉన్నారా? లేక ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉన్నారో అర్థం కాని ప‌రిస్థితి.

ఒక నాయ‌కుడు లేదా నాయ‌కురాలి త‌మ్ముడో, అన్నో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి త‌న అనుచ‌రుల‌ను విడిపించుకుని వ‌చ్చారంటే … వాళ్లు ఏ పార్టీ అయి ఉంటారు? అలాగే ఒక డెయిరీ చైర్మ‌న్ ఇంటికెళ్లి నిన్ను చంపితే కాని, ఆ ప‌ద‌వి మాకు ద‌క్క‌ద‌ని బెదిరిస్తున్నారంటే …ఏ పార్టీ అయి ఉంటారు?. 

ఎమ్మెల్యే ముఖ్య అనుచ‌రుడిని హ‌త్య చేయ‌డానికి తెగ‌బడ్డారంటే ఎవ‌రి అండతో అంత సాహ‌సానికి తెగ‌బ‌డి ఉంటారు? ఎమ్మెల్యే సోద‌రుడిపై చేయి చేసుకోవ‌డం అంటే …. వాళ్ల ధైర్యం ఏమై ఉంటుంది? అలాగే సొంత పార్టీ నేత‌నే భౌతికంగా అంత‌మొందించాల‌ని స్కెచ్ వేయ‌డమే కాదు …. నిందితులు వాళ్ల పేర్లు బ‌య‌ట పెట్టినా అరెస్ట్ కాకుండా య‌థేచ్ఛ‌గా తిరుగుతున్నారంటే ఏ పార్టీ అయి ఉంటారు?… ఈ అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఒకే ఒక్క స‌మాధానం అధికార పార్టీ అని స‌మాధానం వ‌స్తుంది.

కానీ ఇక్క‌డే ఎవ‌రైనా త‌ప్పులో కాలేస్తారు. ఈ అడ్డ‌గోలు, చ‌ట్ట‌వ్య‌తిరేక ప‌నులన్నీ క‌ర్నూలు జిల్లాలో చేసింది ఒక ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన వారంటే నమ్ముతారా? న‌మ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇవ‌న్నీ ప‌చ్చి నిజాలు కాబ‌ట్టి. ఒక ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన నాయ‌కురాలపై ఇన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా ….అధికార పార్టీకి చెందిన ప్ర‌త్య‌ర్థులు మాత్రం చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క పాత్ర పోషించాల్సిన ద‌య‌నీయ స్థితి. మ‌రి చ‌ర్య‌లు తీసుకోడానికి భ‌య‌మెందుకో అర్థం కాదు.

వీటిలో మాజీ మంత్రి అఖిల‌ప్రియ ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం లేక‌పోయినా , ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, త‌మ్ముడు జ‌గ‌న్‌విఖ్యాత్‌రెడ్డి పాత్ర ఎవ‌రూ కాద‌న‌లేనిది. తాజాగా అఖిల‌ప్రియ భూమాయ‌పై క‌లెక్ట‌ర్ వీరపాండియన్‌కు నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి,  గంగుల బిజేంద్రారెడ్డి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అది కూడా ముస్లింల‌కు చెందిన భూమిని భూమా అఖిల‌ప్రియ కుటుంబం ఆక్ర‌మించి డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారంటూ తెర‌పైకి తెచ్చారు.

నంద్యాల‌లో అబ్దుల్ స‌లాం కుటుంబం ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ఈ స్థ‌లంపై ఫిర్యాదు చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆ ఫిర్యాదులోని వివ‌రాలిలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్‌ సాహెబ్‌ వారసులు అనుభవించేవారు. 

ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్‌ షరీఫ్‌ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. అలాగే మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్‌ డెయిరీ ఫార్మా నిర్మించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి మాట్లాడుతూ  భూమా అఖిలప్రియ మాటలకు, చేత‌ల‌కు పొంత‌న లేద‌న్నారు. ముస్లింలపై ప్రేమ కురిపిస్తున్న అఖిల ఆళ్లగడ్డలో మాత్రం వాళ్ల భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు ఎలా నిర్మించార‌ని ప్ర‌శ్నించారు. 

ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ  ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించు కొని అందులో జగత్‌ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

నంద్యా ల‌లో ముస్లిం కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంపై భూమా కుటుంబ సభ్యులు  శవ రాజకీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చేతిలో అధికారం, ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాలున్నా ….చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మీన‌మేషాలు లెక్కించ‌డం ఏంటో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

క‌ర్నూలు జిల్లాలో ప్ర‌త్య‌ర్థుల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే విధంగా అఖిల‌ప్రియ రాజ‌కీయాలు చేస్తున్నార‌నేది నిజం. అఖిల‌ప్రియ త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి ఇటీవ‌ల పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి త‌న అనుచ‌రుల‌ను బ‌ల‌వంతంగా విడిపించుకొచ్చాడు. అలాగే ఇటీవ‌ల నంద్యాల‌లో ఉంటున్న త‌న చిన్న‌బ్బ భూమా నారాయ‌ణ‌రెడ్డి ఇంటికి బావ‌తో క‌లిసి వెళ్లిన విఖ్యాత్ … డెయిరీ చైర్మ‌న్ అయిన ఆ పెద్దాయ‌న్ను బెదిరించి వ‌చ్చాడు. 

ఈ విష‌య‌మై కేసు కూడా న‌మోదైంది. అలాగే ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అనే చందంగా త‌యారైంది. నంద్యాల ఎమ్మెల్యే త‌న అనుచ‌రుడైన లాయ‌ర్ హ‌త్య వెనుక భూమా కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయం ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

క‌నీసం ఇందులో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేద‌ని వైసీపీ ఎమ్మెల్యేలు, శ్రేణులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఖ‌రిపై వైసీపీ గుర్రుగా ఉండ‌డం క‌ర్నూలు జిల్లాలో మాత్ర‌మే ప్ర‌త్యేకం. అక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ , ముఖ్యంగా అఖిల‌ప్రియ చాలా హ్యాపీగా ఉన్నారు. 

రాష్ట్ర‌మంతా టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. కానీ క‌ర్నూలు జిల్లాలో మాత్రం అఖిల‌ప్రియ కుటుంబ అరాచ‌కాల‌పై స‌క్ర‌మ కేసులు కూడా బ‌నాయించ‌డం లేద‌ని స్వ‌యాన వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతుండ‌డం గ‌మ‌నార్హం. అఖిల‌ప్రియ రాజ‌కీయం ముందు ఆమె ప్ర‌త్య‌ర్థులు వెల‌వెల పోతున్నారు. 

యూట్యూబ్ రిపోర్టర్ల పరిస్థితి ఏంటి..?