విజయనగరం జిల్లా బొబ్బిలిలో తయరయ్యే వీణలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచమంతా ఈ వీణల గురించి చెప్పుకుంటారు. చరిత్రలో నిలిచిపోయే పేరును బొబ్బిలి వీణ ఏనాడో సంపాదించుకుంది. కొన్ని వందల ఏళ్ళుగా బొబ్బిలి వీణ పేరు ప్రఖ్యాతులతో అలా తులతూగుతోంది. ఇదిలా ఉంటే భారత తపాలా శాఖ వారు బొబ్బిలి వీణపైన ప్రత్యేక తపాలా కవర్ ని రూపొందిస్తున్నారు.
పోస్టల్ శాఖ 2010లోనే బొబ్బిలి వీణకు భౌగోళిక గుర్తింపు కలిగిన సంపదగా గుర్తించిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్ళకు ప్రత్యేక కవర్ ని కూడా బొబ్బిలి వీణ మీద రూపొందించాలని కూడా నిర్ణయించడం అంటే ముదావహమే అంటున్నారు స్థానికులు.
ఈ నెల 14న బొబ్బిలిలో జరిగే ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేతుల మీదుగా బొబ్బిలి వీణ ప్రత్యేక కవర్ ని ఆవిష్కరణ చేస్తారు. రెండు లక్షల వ్యయంతో ఈ ప్రత్యేక కవర్ ని రూపొందిస్తున్నారు.
ఈ విధంగా బొబ్బిలి వీణ ఖ్యాతిని మరింతగా దేశ విదేశాలకు తెలియచేయడమే లక్ష్యమని పోస్టల్ శాఖ అధికారులు చెబుతున్నారు. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరం జిల్లాకు కూడా ఈ గౌరవంలో వాటా ఉందని జిల్లాకు చెందిన కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.