కరోనా బాలీవుడ్ ను మరోసారి తాకింది. సెకెండ్ వేవ్ లో హీరో అమీర్ ఖాన్ దాని బారిన పడ్డాడు. రీసెంట్ గా సోషల్ మీడియా నుంచి బయటకొచ్చాడు అమీర్ ఖాన్. దీంతో అమీర్ కు కరోనా సోకిన విషయాన్ని ఆయన తరఫు ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు.
“అమీర్ ఖాన్ కు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈమధ్య కాలంలో అమీర్ తో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోండి.”
ఇలా అమీర్ తరఫున ప్రకటన విడుదలైంది. రీసెంట్ గా ముంబయిలో జరిగిన ఓ సినిమా ప్రివ్యూకు అమీర్ హాజరయ్యాడు. అక్కడే ఆయనకు కరోనా సోకి ఉంటుందని అనుకుంటున్నారు. 56 ఏళ్ల అమీర్ ఖాన్ కు ప్రస్తుతం ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవు.
ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్నాడు అమీర్. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. అమీర్ గాయాల బారిన పడడంతో పాటు.. లాక్ డౌన్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు ఏకంగా అమీర్ ఖాన్ కే కరోనా సోకడంతో షూటింగ్ మరోసారి వాయిదాపడింది.