శశికళ జైలు నుంచి వచ్చినపుడు ఎడిఎంకె పార్టీని స్వాధీన పరుచుకుంటానని, తను అభ్యర్థిగా వుండకపోయినా, రాజకీయాల్లో చురుగ్గా వుంటానని ప్రకటించింది. అధికార ఎడిఎంకెలోనే ఇపిఎస్ (ముఖ్యమంత్రి పళనిస్వామి), ఓపిఎస్ (ఉప ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం) వర్గాల మధ్య అంతఃకలహాలున్నాయి. బిజెపితో చేసుకోవాల్సిన సర్దుబాట్లు కూడా వున్నాయి. ఇవి చాలవన్నట్లు శశికళ కూడా వచ్చి ఎడిఎంకె ఓట్లు చీలిస్తే డిఎంకె గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. డిఎంకె గెలవడం బిజెపికి సుతరామూ యిష్టం లేదు. అందువలన మధ్యవర్తుల ద్వారా శశికళకు చెప్పించారు – ప్రస్తుతానికి తగ్గి వుండకపోతే మళ్లీ జైలుకి వెళ్లే ప్రమాదం వుంది జాగ్రత్త అని. ఓట్ల చీలిక వలన లాభపడేది డిఎంకె మాత్రమేనని శశికళ కూడా గుర్తించింది. పైగా ఎడిఎంకె ఓటమి పాపమంతా తన నెత్తినే చుట్టేసి, ప్రజల దృష్టిలో దుష్టురాలిగా ముద్ర వేస్తారని కూడా గ్రహించింది.
అందుకే రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నానని, అమ్మ రాజ్యం కొనసాగాలని కోరుకుంటున్నానని మార్చి 3న ఒక లేఖ ద్వారా ప్రకటించి, మిన్నకుంది. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రకటనకు విలువ వుంటుందని అనుకోవడానికి లేదు. ఆమె వద్ద ధనముంది, ఎడిఎంకె పార్టీలోని సభ్యులందరి గుట్టుమట్లూ వున్నాయి. పార్టీకి విరాళాలు యిచ్చేవారితో సన్నిహిత బాంధవ్యాలున్నాయి, చురుకుతనం వుంది, అన్నిటికీ మించి ఆశ, ఆశయం వున్నాయి. ఆమె తప్పకుండా రాజకీయాల్లోకి వస్తుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఈ ఎన్నికలలో ఎడిఎంకె గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ఇపిఎస్‌కే పోతుంది. శశికళతో మనకు పనేముంది? జయలలిత వారసులిగా మనల్ని ప్రజలు గుర్తించారు అని అతను టముకేసుకుంటాడు. శశికళ మూల కూర్చోవలసి వస్తుంది.
అదే ఎడిఎంకె ఓడిపోయి డిఎంకె గెలిచిందనుకోండి. ఎడిఎంకె ఓటర్లందరూ ‘అయ్యో శశికళ వుంటేనా..?’ అంటూ వాపోతారు. పార్టీని బతికించాలంటే శశికళను వెనక్కి తెచ్చి, సముచిత స్థానం యివ్వాల్సిందే అని పట్టుబడతారు. దీనర్థం – ఎడిఎంకె గెలుపు శశికళ ఓటమి, డిఎంకె గెలుపు శశికళకు రాచబాట. అందువలన శశికళ స్టాలిన్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, అతని అభ్యర్థుల గెలుపుకి సాయపడడానికే ఆస్కారం వుంది. పైగా అతను అధికారంలోకి వస్తే శశికళ పట్ల ఉదారంగా వ్యవహరించి అక్రమాస్తుల స్వాధీనం పట్ల ఉదాసీనంగా వుండవచ్చు. ఇపిఎస్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే శత్రుశేషం వుంచకూడదంటూ శశికళ ఆస్తుల్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అందువలన స్టాలిన్ శశికళతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆశ్చర్యపడనక్కరలేదు.
2016 డిసెంబరు 5న జయలలిత మరణించగానే శశికళ రంగం మీదకు వచ్చేసి చక్రం తిప్పేస్తుందనుకున్నారు. కానీ బిజెపి అధిష్టానం ముఖ్యమంత్రి ఓపిఎస్‌కు మద్దతుగా నిలబడింది. 2017 ఫిబ్రవరిలో ఓపిఎస్ జయ సమాధి వద్ద శశికళకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తానని ప్రకటించాడు. దాంతో శశికళ చకచకా పావులు కదిపి, తను జైలుకి వెళ్లడానికి ముందే అతని స్థానంలో ఇపిఎస్‌ను ముఖ్యమంత్రిని చేసింది. ఇపిఎస్ ఆమెకు పాదాభివందనం చేసిన వీడియో కూడా టీవీల్లో చూపిస్తూంటారు. శశికళ రంగంలో లేకపోవడంతో బిజెపి అధిష్టానం తమిళనాడును తన చేతుల్లోకి తీసుకుంది. ఓపిఎస్‌తో రాజీ కుదుర్చుకుని, అతన్ని ఉపముఖ్యమంత్రిని చేయమని ఇపిఎస్‌పై ఒత్తిడి తెచ్చింది. ఆపై ఇద్దరూ కలిసి శశికళను పార్టీ నుంచి బహిష్కరించేశారు. ఆమె వర్గం పని ఫినిష్ అనుకుని మురిసిపోతుండగానే 2017 డిసెంబరులో శశికళ సోదరి కుమారుడు దినకరన్ ఆర్‌కె నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికై కంగారు పుట్టించాడు. 18 మంది ఎమ్మెల్యేలు అతనితో వెళ్లిపోయారు. శశికళ జైలు నుంచి తిరిగి వచ్చినపుడు ఏమవుతుందోనన్న భయం పట్టుకున్న ఎడిఎంకె నాయకులు బిజెపితోనే అంటకాగుతూ వచ్చారు.
ఇపిఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు అతనిపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. ఓపిఎస్ అయితే తాత్కాలిక ముఖ్యమంత్రిగా సార్లు చేశాడు కాబట్టి అనుభవం వుంది కానీ యితనికి కేవలం మంత్రిగానే అనుభవం వుంది. అయినా యితను తన పాలనాసామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రజలకు అందుబాటులో వుంటూ, అధికారగణంతో సన్నిహితంగా మెలుగుతూ, అవినీతి ఆరోపణలు పెద్దగా లేకుండా, మరీ అట్టహాసాలు చేయకుండా బండి లాక్కుని వచ్చేశాడు. నదుల్లో, కాలువల్లో పూడిక తీయించాడు. కోవిడ్ నియంత్రణ మొదట్లో బాగానే చేసినా, కోయంబేడు మార్కెటు తెరిచి, కోవిడ్ ఉధృతికి కారకుడయ్యాడు. అలాగే యీ సంక్రాంతికి సినిమా థియేటర్లను 100% కెపాసిటీతో తెరవమని ఆదేశాలిచ్చి విమర్శల పాలయ్యాడు. స్థానిక ప్రజలు ఎంత తప్పుపట్టినా బిజెకి దాసోహమనే రీతిలోనే ప్రవర్తించాడు. సాగు బిల్లులు, నీట్‌లతో సహా, వారి నిర్ణయాలన్నిటికీ తలొగ్గి, తమిళనాడును ఉత్తర భారతీయ పార్టీ ఐన బిజెపికి తాకట్టు పెట్టేశాడనే నింద పడ్డాడు.
దీని ప్రభావం 2019 పార్లమెంటు ఎన్నికలలో తీవ్రంగా పడింది. 2014 పార్లమెంటు ఎన్నికలలో 39టిలో 37 స్థానాలు తెచ్చుకున్న ఎడిఎంకె 2019లో ఒక్కటే తెచ్చుకోగలిగింది. దాని ఓటు షేర్ 44 నుంచి 19కి పడిపోయింది. డిఎంకె 33% ఓట్లతో 24 సీట్లు గెలుచుకుంది. దాని భాగస్వామి కాంగ్రెసు 13% ఓట్లతో 8 తెచ్చుకుంది. ఇతర భాగస్వాములకు 6 వచ్చాయి. అసెంబ్లీ స్థానాలుగా చూస్తే ఆ కూటమికి 216 స్థానాల్లో మెజారిటీ వచ్చింది. కానీ అదే ఏడాది డిసెంబరులో జరిగిన స్థానిక ఎన్నికలలో ఎడిఎంకె పుంజుకుంది. డిఎంకెకు 243 జిల్లా పంచాయితీ వార్డులు వస్తే ఎడిఎంకెకు 214 వచ్చాయి.
బిజెపికి 3% లోపే ఓట్లు వస్తున్నాయి. 2016 ఎన్నికలలో 188 స్థానాల్లో పోటీ చేసి 180టిలో డిపాజిట్ పోగొట్టుకుంది. 2019లో దేశమంతా మోదీ హవా వీచినా, యిక్కడ ఒక్క సీటూ రాలలేదు. అయినా ఇపిఎస్‌కు గత్యంతరం లేక మళ్లీ బిజెపితోనే చేతులు కలుపుతున్నాడు. వాళ్లకు 20 సీట్లు యిచ్చాడు. కన్యాకుమారి పార్లమెంటు సీటు నిచ్చాడు. స్వాభిమాని ఐన జయలలిత నేతృత్వం వహించిన ఎడిఎంకెని బిజెపికి తాకట్టు పెడుతున్నాడనే ముద్ర పడడమే అతనికి పెద్ద మైనస్ అయింది. పైగా బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల పట్ల ప్రజలకు వ్యతిరేకత వుంటే అది యితనిపై ప్రసరించడం ఖాయం. కేవలం రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీగానే వుండి వుంటే ఎడిఎంకె, డిఎంకెను సమర్థవంతంగా ఎదుర్కుని వుండేది.
ఎందుకంటే ఇపిఎస్ పాలకుడిగా మార్కులు తెచ్చుకుంటూనే రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి చాలా చర్యలు చేపట్టాడు. మెడికల్ కాలేజీ సీట్లలో 7.5%ను ప్రభుత్వ స్కూలు విద్యార్థులకు రిజర్వ్ చేశాడు. కేంద్రం చేసిన సాగు బిల్లులు సమర్థించి రైతులకు అన్యాయం చేశాడన్న పేరు పోగొట్టుకోవడానికి ఎన్నికలకు వెళ్లబోతున్న క్షణంలో ఫిబ్రవరి 5న 16.40 లక్షల రైతులకు రూ. 12,110 కోట్ల ఋణమాఫీ చేశాడు. తనను తాను రైతుబిడ్డగా ప్రొజెక్టు చేసుకుంటున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రతీ యింటికి రూ. 2500 యిచ్చాడు. జయలలిత సమాధిని, అణ్నా, ఎమ్జీయార్‌ల సమాధుల కంటె మిన్నగా మ్యూజియం, డిజిటల్ షో, నాలెజ్ పార్కులతో సహా రూ.80 కోట్లతో కట్టించి ఆమె చనిపోయిన 4 ఏళ్ల తర్వాత, యీ జనవరి 27న ప్రారంభించాడు. జయలలిత యింటిని స్వాధీనం చేసుకుని దాన్ని మెమోరియల్‌గా చేస్తున్నాడు.
బిజెపి సొంతంగా ఎదగడానికి కోవిడ్ ఉధృతంగా వున్న రోజుల్లోనే మురుగన్‌కు సంబంధించిన 6 పుణ్యక్షేత్రాలకు వేల్ యాత్ర అని నిర్వహించబోయింది. కోవిడ్ కాబట్టి అనుమతి యివ్వం అంటూ ఇపిఎస్ ప్రకటించాడు. అయినా మేం వెళతాం అంటూ రోజూ పొద్దున్నే బిజెపి కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరేవారు. పోలీసులు వెంటనే వచ్చి నిర్బంధంలోకి తీసుకుని సాయంత్రమే విడిచి పెట్టేసేవారు. వాళ్లే మర్నాడు పొద్దున్న బయలుదేరేవారు. మళ్లీ అరెస్టు, సాయంకాలమే విడుదల, మళ్లీ ఉదయం.. ఈ నాటకం నెల్లాళ్లపాటు సాగింది. యాత్రకు ప్రయత్నించిన క్రెడిట్ వచ్చిందని బిజెపి, ఆపామన్న క్రెడిట్ వచ్చిందని ఇపిఎస్ యిద్దరూ సంతోషించారు. మురుగన్‌పై మాకు భక్తి వుంది అని చాటుకోవడానికి ఆయనకు సంబంధించిన తైపూసమ్ పండగను (యీసారి జనవరి 28న వచ్చింది) ప్రభుత్వ సెలవుగా ప్రకటించాడు ఇపిఎస్.
అతనిపై ఓపిఎస్ వర్గానికి చాలా ఫిర్యాదులున్నాయి. తమ నాయకుణ్ని పట్టించుకోలేదని, కీలకమైన విషయాల్లో సంప్రదించలేదని వారన్నారు. ఇపిఎస్ పశ్చిమ తమిళనాడులో ప్రధానంగా వున్న గౌండర్ కులానికి చెందినవాడు. తన కులస్తులకే పదవులు, అధికారాలూ అన్నీ కట్టబెడుతున్నాడని, సెక్రటేరియట్‌లో ఆ కులస్తులే చక్రం తిప్పుతున్నారని తక్కిన వారందరికీ, ముఖ్యంగా ఓపిఎస్ కులస్తులైన దేవర్‌లకు గుర్రుగా వుంది. వాళ్లకు దక్షిణ తమిళనాడులో 25 నియోజకవర్గాల్లో పట్టుంది. ఓపిఎస్, శశికళ అదే కులానికి చెందినవారు కాబట్టి శశికళ బయటకు వచ్చాక ఆ కులపెద్దలు యిద్దర్నీ కలుపుతారని ఊహించిన ఇపిఎస్ ఆమె జైలు నుంచి రాకుండానే తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్లి తీరతానని పార్టీ సమావేశంలో ప్రకటించాడు. తర్జనభర్జనలెన్ని జరిగినా చివరకు ఓపిఎస్ సరేననవలసి వచ్చింది.
హమ్మయ్య అనుకుంటూండగానే శశికళ జైలు నుంచి తిరిగి వచ్చింది. ఆ రావడం కూడా ‘రాణి వెడలె’ అన్నట్లు వచ్చింది. ప్రజాసందోహం చుట్టుముట్టడంతో బెంగుళూరు నుంచి మద్రాసుకి 7 గంటలు పట్టాల్సింది 23 గంటలు పట్టింది. 60 చోట్ల ఆగి హారతులు అందుకుంది. మధ్యలో గుళ్లలో పూజలు చేసింది. గజమాలలు వేసింది. ఎడిఎంకె జండా ఉపయోగించకూడదంటూ పోలీసులు అడ్డుపడబోతే ఎడిఎంకె నాయకులు తమ కార్లు యిచ్చారు. చెన్నయ్‌లో దిగి పార్టీలో నా పోస్టు వెనక్కి తీసుకుంటా అంది. వెంటనే ఇపిఎస్ 10 మంది ఆఫీసు బేరర్లను పార్టీ నుంచి బహిష్కరించాడు. అయినా సద్దు మణగకపోవడంతో, ఆమె కనుక వచ్చిందంటే పార్టీలో తాము మళ్లీ అనామకులమై పోతామని యీ నాయకద్వయానికి తోచింది. అందుకే అమిత్ షా వీళ్లిద్దరినీ పిలిచి శశికళను కలుపుకుని పొండి అని ఎంత చెప్పినా వినలేదు. చివరకు అమిత్‌కు తప్పుకోవాలని శశికళ మీదనే ఒత్తిడి తీసుకుని రావలసి వచ్చింది. శశికళ చెన్నయ్ యాత్రను ఆర్గనైజ్ చేసిన దినకరన్ ఆమె నిర్ణయంతో నిర్ఘాంతపోయాడు. గతంలో అతని వెంట పార్టీ విడిచి వచ్చిన 18 మందిలో దరిమిలా యిద్దరు డిఎంకెలో చేరిపోయారు. ఒకతను పోయాడు. తక్కిన 15 మంది ఎడిఎంకెకు తిరిగి వెళ్లిపోవచ్చని అతని భయం.
ఇప్పుడీ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమి ద్వారా ఎడిఎంకె 179, వణ్నియార్ల పార్టీ ఐన పిఎంకె 23, బిజెపి 20, మూపనార్ కొడుకు వాసన్ పార్టీ 6, తక్కిన ఆరు పార్టీలూ ఒక్కోటి చొప్పున పోటీ చేస్తున్నాయి. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ద్వారా డిఎంకె 173, కాంగ్రెసు 25, సిపిఐ 6, సిపిఎం 6, దళితుల పార్టీ ఐన విసికె 6. వైకో పార్టీ ఎండిఎంకె 6, ముస్లిం లీగ్ 3, యివి కాక 6 పార్టీలు 9 సీట్లకు పోటీ చేస్తున్నాయి. దినకరన్ కూటమి ద్వారా అతని పార్టీ 161, విజయకాంత్ డిఎండికె 60, మజ్లిస్ 3, తక్కిన 5 పార్టీలు కలిసి 10 సీట్లు పోటీ చేస్తున్నాయి. కమల్ హాసన్ కూటమి ద్వారా అతని పార్టీ 141, (2019 ఎన్నికలలో అతని పార్టీకి 3.7% ఓట్లు వచ్చాయి) శరత్ కుమార్ పార్టీ 35, ఐజెకె 40, తక్కిన రెండు పార్టీలు 14 పోటీ చేస్తున్నాయి. విడిగా సీమాన్ అనే సినీ దర్శకుడి పార్టీ 234 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ప్రధాన కూటముల్లో సీట్ల పంపిణీ ఓ పట్టాన తెగలేదు. వచ్చిన చిక్కేమిటంటే డిఎంకె, ఎడిఎంకె రెండిటికీ ఖచ్చితమైన 25% ఓటు బ్యాంకుంది, మంచి ఆర్గనైజేషనూ వుంది. ఎవరి వైపు ఊపుంటే వాళ్లకు 5% ఎక్కువ వస్తాయి. అయితే యితర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప విన్నింగ్ మార్జిన్ రాదు. 2016 ఎన్నికలలో ఎడిఎంకె కేవలం 1% తేడాతో నెగ్గింది. ఎందుకంటే కులాల వారీగా ఏర్పడిన చిన్నాచితకా పార్టీలన్నిటికి తమదైన ఓటు బ్యాంకు వుంది. అవన్నీ కలిస్తేనే గెలుపు. తమ అవసరం వుందని తెలిసిన చిన్న పార్టీలు తమ స్థాయికి మించి సీట్లడుగుతాయి, గీచిగీచి బేరాలాడతాయి. టిక్కెట్టు యిచ్చిందాకా వుండి వీళ్లు నెగ్గలేకపోతే అవతలివాళ్లకు లాభిస్తుందని యీ పెద్ద పార్టీల బాధ.
ఏది ఏమైనా 234 సీట్ల అసెంబ్లీలో 118 సీట్లు కనీసం తెచ్చుకుని సొంతంగా ప్రభుత్వం ఏర్పరచుకుంటే చిన్న పార్టీల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగనక్కరలేదని పెద్ద పార్టీల లెక్క. 118 గెలవాలంటే ఓ 60 దాకా మార్జిన్ వేసుకుని రమారమి 175 స్థానాలు పోటీ చేసి, తక్కినవి మిత్రులకు యివ్వాలి. ఈ ఎన్నికలో డిఎంకె 173 పోటీ చేస్తూండగా, ఎడిఎంకె 179 చేస్తోంది. విజయకాంత్ పార్టీ 2011లో 41 సీట్లు పోటీ చేసి 29 తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచి క్షీణిస్తూ వచ్చింది. 2016లో ఒక్క సీటూ రాలేదు. పైగా విజయకాంత్ ఆరోగ్యం కూడా బాగా లేదు. అయినా బేరాల్లో ఏమీ తగ్గలేదు. ఎవరితోనూ కుదరక చివరకు దినకరన్‌తో చేతులు కలిపాడు.
డిఎంకె కూటమిలో కాంగ్రెసు పెద్ద తలకాయనొప్పిగా తయారైంది. ప్రతీ రాష్ట్రంలోను అది శక్తికి మించి సీట్లడిగి, గెలవలేక, తద్వారా కూటమికి నష్టం కలగచేస్తోంది. 2016లో దెబ్బలాడి 41 సీట్లు తీసుకుని 8 మాత్రం గెలిచింది. వాళ్లకు అన్ని యివ్వకుండా వుండి వుంటే తాము అధికారంలోకి వచ్చేవాళ్లం అని డిఎంకె చాలా బాధపడింది. ఈసారి కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడు పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టినా 25 యిచ్చి చాల్లే అంది. కన్యాకుమారి పార్లమెంటు స్థానంలో బిజెపితో పోటీపడు అని చెప్పింది. తమ రాష్ట్రం నుంచి కాంగ్రెసు పార్టీ సభ్యుణ్ని రాజ్యసభకు పంపుతామని మాట యిచ్చి వూరుకోబెట్టింది. పిఎంకె ఎడిఎంకెతో చేతులు కలిపింది కాబట్టి వాళ్లతో అడుగడుగునా పోరాడుతున్న దళిత పార్టీ విసికె డిఎంకె కూటమిలో చేరి 6 సీట్లు తీసుకుంది. కరుణానిధి స్టాలిన్‌కు ప్రాముఖ్యత యివ్వడంపై కోపగించుకుని పార్టీలోంచి బయటకు వెళ్లిపోయిన ఒకప్పటి కరుణానిధి దత్తపుత్రుడు వైగో, విడిగా విజయం సాధించలేక యిప్పుడు అదే స్టాలిన్ నేతృత్వంలోని కూటమిలో చేరి 6 సీట్లు తీసుకున్నాడు.
2016 అసెంబ్లీ ఎన్నికలలో అనారోగ్యంతో కదలలేని కరుణానిధిని ముఖ్యమంత్రిగా చూపించడం కంటె స్టాలిన్‌ను చూపించి వుంటే డిఎంకె నెగ్గేది అనుకున్నారు. అప్పుడు ఎడిఎంకె ఒంటరిగా పోటీ చేసి 40.9% ఓట్లతో 136 స్థానాలు గెలిచింది, డిఎంకె కూటమికి 39.8% ఓట్లు వచ్చాయి కానీ 98 సీట్లే వచ్చాయి. విడిగా చూస్తే డిఎంకెకు 89 (32%), కాంగ్రెసుకి 8 (6%) ముస్లిం లీగుకి 1! ఇప్పుడు స్టాలిన్ ఒక్కడే ప్రముఖనేతగా వున్నాడు. డిఎంకెలో అతనికి ఎదురు లేదు. అళగిరి పార్టీలోంచి బయటకు వెళ్లిపోయి, రాజకీయాల్లోంచే తప్పుకున్నాడు. కనిమొళి స్టాలిన్‌కు కమాండర్‌గా పనిచేస్తోంది. డిఎంకె అధికారంలోకి వస్తే గూండాయిజం పెరుగుతుందనే భయం ఓటర్లలో వుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగితే స్టాలిన్‌కు ఛాన్సు ఎక్కువుంది. ప్రశాంత కిశోర్ ఐ-పాక్ సలహాలు తీసుకుంటున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2020-21 సం.రానికి రూ.66 వేల కోట్లు లోటులో వుందంటున్నారు. అయినా యిరు కూటములు వాగ్దానాల వర్షం కురిపించేస్తున్నాయి.
ఎడిఎంకె పదేళ్లు అధికారంలో వుంది కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా వుంటుంది. పైగా మూడు ముక్కలుగా చీలి వుంది. తమిళులు ఎన్నడూ ఆదరించని బిజెపి గుదిబండ ఒకటి దాని మెడకు వేళ్లాడుతోంది. ఇది తెలిసి ఇపిఎస్ పిఎంకెతో పొత్తు కోసం ఆరాట పడి కులాలవారీగా చీలిన తమిళ సమాజాన్ని మరింత చీల్చి, యింకో కులాగ్నికి ఆజ్యం పోశాడు. అన్నిటికన్న తీసుకున్న రాజకీయపు టెత్తుగడ రిజర్వేషన్ల విషయంలో పిఎంకె డిమాండును అంగీకరించడం. పిఎంకె ప్రాతినిథ్యం వహించే వణ్నియార్లు ఉత్తర తమిళనాడులో బలంగా వున్నారు. 2016లో, 2019లో విడిగా పోటీ చేసి ఒక్కసీటూ గెలవలేక పోయినా దానికి 5.4% ఓటు బ్యాంకుంది. ఎవరికి కావాలంటే వాళ్లకు బదిలీ చేయగలదు. ఎంబిసిలలో తమకు ప్రత్యేక రిజర్వేషన్ విషయం తేలిస్తే తప్ప చర్చలకు కూడా రామని డా. రాందాస్ మొండికేశాడు. తమకు విడి రిజర్వేషన్ కావాలనే వాళ్ల డిమాండ్ చాలా పాతది.
తమిళనాడులో బిసిలకు రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ. ద్రవిడ పార్టీల నాయకులలో చాలామంది నాయకులు, ఓటర్లు ఆ వర్గానికి చెందినవారే. ఆ వర్గానికి రిజర్వేషన్ కల్పించడంలో చాలా ఉదారంగా వ్యవహరించారు. అయితే పోనుపోను బిసిల్లో కొన్ని కులాల వాళ్లే ప్రయోజనాలన్నిటినీ కాజేస్తున్నారని తక్కినవారు అనడం మొదలెట్టి తమ హక్కుల కోసం విడివిడి కులపార్టీలు పెట్టుకోసాగారు. అందువలన 30 ఏళ్ల క్రితం కరుణానిధి 50% ఒబిసి రిజర్వేషన్లను బిసి ఎంబిసి (మోస్ట్ బాక్‌వర్డ్) అని రెండుగా విడగొట్టాడు. బిసిలకు 30% (దీనిలో ముస్లిములకు 3.5% సబ్ రిజర్వేషన్ యిచ్చారు), ఎంబిసిలకు 20% అన్నాడు. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్లతో కలిపి మొత్తం 69% అయింది. సుప్రీం కోర్టు విధించిన 50% సీలింగు అధిగమించడానికి, జయలలిత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్‌లో చేర్పించింది. ఇది చూపించే తమ రాష్ట్రంలో కూడా 50% సీలింగు దాటనివ్వాలని అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
మొత్తం 109 కులాలు వున్న ఎంబిసిలో తమను పడేయడం వణ్నియార్లకు నచ్చలేదు. తమకు విడిగా రిజర్వేషన్ కావాలని గొడవ చేశారు. వాళ్ల ఓట్లు కావాలి కాబట్టి యిప్పుడు ఒపిఎస్ ఎంబిసిలకు మొత్తం 20% రిజర్వేషన్ వుంటే దానిలో కేవలం వణ్నియార్లకే 10.5% సబ్ రిజర్వేషన్ యిచ్చాడు. 68 కులాలకు కలిపి 7%, తక్కిన 40టికి కలిపి 2.5% అన్నాడు. అసెంబ్లీ ఆఖరి సెషన్‌లో ఆ బిల్లు పాస్ చేశాడు.
జనార్దనన్ కమిటీ సిఫార్సు ప్రకారం చేశాం, ఇది తాత్కాలికమే, కులాలవారీ జనగణన పూర్తయ్యాక అప్పుడు కరక్టు ఫిగర్ తెలుస్తుంది అన్నాడు. కొన్ని గంటల్లోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. ఆ బిల్లుకి వ్యతిరేకంగా కొందరు హై కోర్టుకి వెళితే మార్చి 9న స్టే యివ్వం కానీ ప్రభుత్వం 8 వారాల్లోగా ప్రశ్నలకు జవాబివ్వాలి అంది. ఈలోగా ఎన్నికలు పూర్తయిపోతాయి. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో ఎన్నికలైన నెల్లాళ్లకు ఫలితాలు వచ్చినపుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మెడలు వంచి తామనుకున్నది సాధించిన వణ్నియార్లకు బుద్ధి చెప్పాలని శశికళ కులస్తులైన దేవర్లు అనుకుంటే వాళ్లు ఎడిఎంకెకు కూడా డిఎంకెకు ఓట్లు వేయవచ్చు. నేనే వేయించానని చెప్పుకుని స్టాలిన్ వద్ద ప్రయోజనాలు పొందవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)