దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు, అతని నీడలా వెన్నంటి నడిచిన సూరీడు మీద ఈ రోజు దాడి జరిగింది. దాడికి పాల్పడింది పరాయి వాళ్లు కాకపోవడం గమనార్హం. కుటుంబ సమస్యల నేపథ్యంలో సూరీడు మీద ఆయన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి భౌతిక దాడికి తెగబడ్డాడు.
వైఎస్ హయాంలో సూరీడు తన పేరుకు తగ్గట్టే ఓ వెలుగు వెలిగాడు. వైఎస్ యోగక్షేమాలను వెన్నంటి ఉండి చూసుకునేవాడు. దీంతో సూరీడు అంటే తెలియని వారుండరు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సూరీడు నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సూరీడు కుమార్తె గంగాభవానీ, అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు వచ్చినట్టు సమాచారం.
భార్యను వేధిస్తున్నాడని గతంలో సురేంద్రనాథ్‌రెడ్డిపై గృహ హింస కేసు నమోదైంది. కేసు వెనక్కి తీసుకోవాలని పలుమార్లు సూరీడుతో పాటు ఆయన కూతురిపై అల్లుడు పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని సమాచారం. కానీ వినిపించుకోకపోవడంతో వారిపై అల్లుడు ఆగ్రహంగా ఉన్నాడు.
దీంతో జూబ్లీహిల్స్‌లో ఉంటున్న సూరీడు నివాసానికి వెళ్లి క్రికెట్ బ్యాట్‌తో అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. తన తండ్రిని భర్త సురేంద్రనాథ్‌రెడ్డి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ సూరీడు కుమార్తె గంగా భవానీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.