తెలంగాణలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను బరిలో దిగనున్నట్టు ఆమె తాజాగా తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలో షర్మిల తనను ఆషామాషీగా తీసుకోవద్దనే హెచ్చరికను అన్ని పార్టీలకు పంపినట్టైంది. లోటస్‌పాండ్‌లో బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా షర్మిల సంచలన ప్రకటన చేశారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కడప జిల్లా పులివెందుల ఎలాగో, తనకు ఖమ్మం జిల్లా పాలేరు అలా అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అక్కడి నుంచే బరిలో దిగనున్నట్టు కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటనతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఆ నియోజకవర్గంలోని బలాబలాల గురించి రాజకీయ వర్గాలు ఆరా తీయడం స్టార్ట్ చేశాయి. ఈ నియోజకవర్గం 1962 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ అయ్యింది.
ఇక్కడ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టులకు బలం ఉంది. ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలుపుకుని మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009, 2014లో కాంగ్రెస్ తరపున రామిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి, నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రతాప్‌రెడ్డి విజయం సాధించారు.
ఇక్కడి నుంచి 11 సార్లు కాంగ్రెస్, ఒకసారి సీపీఐ, రెండుసార్లు సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎంపిక చేసుకున్న పాలేరు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి బలమైన కంచుకోట అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పైగా 2014లో రాష్ట్ర విభజన సమయంలో వైసీపీకి ఖమ్మం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు, ఖమ్మం ఎంపీ సీటు గెలుపొందడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏ విధంగా చూసినా షర్మిల సరైన నియోజకవర్గాన్నే ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.