ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో దేశ వ్యాప్తంగా పోటీ అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ! అయితే ఆప్ కు ఇలాంటి ఉత్సాహం కొత్తది ఏమీ కాదు. ఆప్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రతి చోటా చిత్తు అయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఆ మధ్య పోటీ చేసింది. అయితే ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఢిల్లీలో సాధించిన విజయం ఆప్ గ్రాఫ్ ను ఎంతో కొంత పెంచే ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పోటీ అంటూ ఆ పార్టీ హడావుడి చేస్తూ ఉంది.
అందులో భాగంగా మధ్యప్రదేశ్ లో గుజరాత్ లో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందట. ఒక రాజకీయ పార్టీ అన్నాకా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, పోటీ చేయకాపోవచ్చు. అది దాని ఇష్టం. అయితే దేశ వ్యాప్తంగా అంటూ ఆప్ చేస్తున్న హడావుడి అంతిమంగా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా అనేది సందేహాస్పదమైన విషయం. ఆప్ ప్రధాన ఓటు బ్యాంకు వనరు బీజేపీ వ్యతిరేకత!
బీజేపీ వ్యతిరేక ఓటు ఆప్ కు గట్టిగా పడింది. ఢిల్లీలో అది స్పష్టం అయ్యింది. ఆఖరికి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా ఆప్ కొల్లగొట్టింది. బీజేపీ వ్యతిరేక ఓటు అయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆప్ కు పడింది. కాంగ్రెస్ కు ఓటేసినా గెలవదేమో అనే అనుమానంతో, బీజేపీ గెలవకపోతే చాలనే లెక్కలతో వారు ఊపు మీదున్న ఆప్ కు ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం లోపు ఓట్లకు పరిమితం అయ్యింది. బీజేపీని ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ను మరింత దెబ్బతీసింది.
ఇక ఇప్పుడు ఆప్ మళ్లీ దేశ వ్యాప్తంగా అంటోంది. ఒకవేళ అదే జరిగితే..అది కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకుకే చిల్లు పెట్టే అవకాశాలుంటాయి. అదే సమయంలో గ్రహించాల్సిన అంశం ఏమిటంటే.. అన్ని చోట్లా ఢిల్లీలోలా ఆప్ విజయం సాధించే అవకాశాలు ఉండవు. తను గెలవలేకపోగా.. బీజేపీ వ్యతిరేక ఓటును ఎంతో కొంత శాతం చీల్చి ఆప్ ఆ పార్టీకి మేలు చేసినా చేయవచ్చు!