మొదట ఏదో మాట్లాడటం, ఆ తర్వాత నాలుక్కరుచుకోవడం జేసీ సోదరులకు అలవాటే. బోల్డ్‌గా మాట్లాడతారు అనే పేరే కానీ, వీరు తమ నోటి దురుసుతో తమ రాజకీయానికే ఎర్త్ తెచ్చుకుంటూ సాగుతున్నారు. చాలా కాలంగా ఇదేతీరు కొనసాగుతూ ఉంది. వైఎస్ హయాంలోనే జేసీ దివాకర్‌రెడ్డి అనవసరమైన వివాదాలు రేపుకున్నారు. దీంతో వైఎస్ కేబినెట్లో రెండోసారి మంత్రిపదవి దక్కలేదు.
వైఎస్ మరణించాకా ఆయన విషయంలో అనుచితంగా మాట్లాడారు. అలా మాట్లాడినప్పటికీ నాటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వీరికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. దివాకర్ రెడ్డికి మంత్రిపదవి కూడా ఇవ్వలేదు. ఇక చంద్రబాబు జమానాలో దివాకర్‌రెడ్డి ఒక రేంజ్లో పేట్రేగారు. అంతలా రెచ్చిపోయినందుకు చంద్రబాబు నాయుడు ఆయనకు ఏం లబ్ధిచేకూర్చారో కానీ.. ఆ తీరుతో జగన్‌కు పూర్తిగా దూరంఅయ్యారు. జగన్ సంగతెలా ఉన్నా.. జేసీ దివాకర్‌రెడ్డి సోదరులను సొంత నియోకవర్గం రెడ్లే అసహ్యించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలోనూ ఓటమి తప్పలేదు.
ఇక వీరిచూపు భారతీయ జనతాపార్టీ వైపు ఉందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. సంప్రదింపులు జరిగాయని.. దివాకర్‌రెడ్డి పెద్దపదవే అడిగారని, అది కుదరకపోవడంతో చేరిక ఆగిందని టాక్. ఇలా అధికారం ఏ పార్టీ చేతిలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్లే వాళ్లుగా తమ కెరీర్‌ను ముగిస్తున్నారు జేసీ సీనియర్లు. ఇటీవలే అంశం మీద ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. కొన్నిరోజుల్లో తెలుగుదేశం పార్టీ వెళ్లి బీజేపీలో విలీనం అవుతుందని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా బీజేపీపై మమకారం చూపించారు ప్రభాకర్ రెడ్డి.
అయితే ఆ అంశం మీద ఆయనే మరోసారి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలోకి తెలుగుదేశం విలీనం అయ్యేదేమీ ఉండదని చెప్పుకొచ్చారు. అలా విలీనం చేయడానికి తను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కాదంటూ ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అయినా విలీనం అవుతుంది అని చెప్పినప్పుడు తను తెలుగుదేశం పార్టీకి జాతీయాధ్యక్షుడు కాదు అనే విషయం ప్రభాకర్ రెడ్డికి తెలియదని అనుకోవాలా! ఆ విషయం లేట్‌గా గుర్తుకు వచ్చిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవిక్కడ.
ఏదేమైనా తన వ్యాఖ్యలను ప్రభాకర్ రెడ్డి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. బీజేపీలోకి తెలుగుదేశం విలీనం జరిగేదికాదని తేల్చారు. అలాగే తాము భారతీయ జనతా పార్టీలోకి చేరడం లేదని కూడా చెప్పుకొచ్చారు. తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాన్ని పోలీసులు అదుపులో పెట్టాలంటూ ఉచితసలహా కూడా ఇచ్చారు దివాకర్‌రెడ్డి!