అమరావతి త్యాగధనుల డొల్లతనాన్ని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ బయట పెట్టారు. ఇందుకు ఆయన నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ వేదిక కావడం సంతోషించదగ్గ విషయం. అసలు గుండె విప్పి నిజాలు చెప్పే కార్యక్రమం. పేరుకు తగ్గట్టు కార్యక్రమానికి సార్థకత లభించిన ఏకైక ఇంటర్వ్యూగా బహుశా ఏబీఎన్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఉద్యమించే వాళ్లకు రెండేళ్లుగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థ గట్టి మద్దతుగా నిలిచింది. ‘అమరావతి’ ఉద్యమం ఏమీ లేకపోయినా…ఏదో జరుగుతోందని భ్రమను క్రియేట్ చేసేందుకు ఆ మీడియా సంస్థ ప్రయత్నించిందనే అభిప్రాయాలు లేకపోలేదు. తాను నమ్మిన దాని కోసం ఆ మాత్రం నిలబడడాన్ని అర్థం చేసుకోవచ్చు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 35 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారని, ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఘనతే అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ అనేకమార్లు తన కొత్తపలుకులో రాసుకొచ్చారు. అమరావతి రైతులది ముమ్మాటికీ త్యాగమే అని బూర్జువా రాజకీయ పార్టీలే కాదు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా పదేపదే చెప్పడం తెలిసిందే. బహుశా అమరావతి రాజధాని నిర్మాణానికి 35 వేల ఎకరాలను దానం ఇచ్చిన వారికి జగన్ అన్యాయం చేస్తున్నారనే వ్యతిరేకతను సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా ప్రయత్నించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అమరావతి త్యాగంలోని డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. అమరావతిలో త్యాగం కాదు అంతా వ్యాపారమే ఉందని ఉద్యమకారులతోనే చెప్పించడం ఈ వారం ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ గొప్పదనంగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, అమరావతి రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు పువ్వాడ సుధాకర్, మహిళా జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజ పాల్గొన్నారు. నిప్పు లాంటి నిజాన్ని ఆలస్యంగానైనా తమకు తామే బయట పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారనే విమర్శలను కొట్టి పారేసేవాళ్లకు కనువిప్పు కలిగేలా వేమూరి రాధాకృష్ణతో సదరు ఉద్యమ నేతలతో నిజాలను రాబట్టారు.
పూలింగ్‌కు ఇవ్వకముందు మీ ప్రాంతంలో భూములు ధరలు ఎంత ఉండేవి? అని ఆర్కే సంధించిన ప్రశ్నకు అమరావతి రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు పువ్వాడ సుధాకర్ సమాధానం … ‘మాది మెట్ట భూమి కాబట్టి ఎకరా ఐదారు లక్షలు ఉండేది. 2002 నుంచి కాలువ వచ్చి రెండు పంటలు పండడం మొదలైంది. దాంతో భూమి ధర పాతిక లక్షల వరకూ వచ్చింది. వెంకట పాలెం వద్ద జాతీయ రహదారి ప్రకటించారు. దాంతో అక్కడ మూడు కోట్ల ధర ఉంది’
అలాగే మరో ప్రశ్నకు సుధాకర్ సమాధానం… ‘భారతదేశ చరిత్రలో, ఆదాయ పన్ను చరిత్రలోనే ఈ ల్యాండ్ పూలింగ్‌కు వచ్చిన పన్ను మినహాయింపే మొదటిది. ఈ రోజు నిజమైన అమరావతి ఉంటే రైతులకు 30-40 వేల కోట్ల రూపాయల ప్రయోజనం వచ్చేది’
మీకు పరిహారం ఇవ్వాల్సిందే కదా? పరిహారం ఎంత రావచ్చు? అని ఆర్కే ప్రశ్నించగా, సుధాకర్ సమాధానం ఏంటంటే… ‘2013 చట్టం ప్రకారం చూసినా 34,573 ఎకరాలకు రమారమి 1.20 నుంచి 1.60 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే. అలాగే జీవనాధారం కోల్పోయిన వాళ్లకూ పరిహారమివ్వాలి’
‘అంటే ఎకరాకు 3 కోట్ల రూపాయలు రావొచ్చు.. అంటే రాజధాని ఉన్నా లేకున్నా మీరు బాగుపడినట్లే కదా?’ అని ఆర్కే అమాయకంగా అసలు నిజాన్ని బయట పెట్టారు. ఈ మొత్తం ఇంటర్వ్యూ చూసిన వాళ్లెవరైనా…అమరావతి రైతులది త్యాగమని చెప్పగలరా? పచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఆడిటర్ అయిన సుధాకర్ సమాధానాలు చెబుతున్నాయి. అమరావతిలో జరిగింది ల్యాండ్ ఫూలింగ్ కాదు…ముమ్మాటికీ రాష్ట్రంలోని ఆ 29 గ్రామాలు మినహా మిగిలిన ప్రాంతాలను ల్యాండ్ ఫూల్స్ చేయడమే. ఆ 29 గ్రామాల్లో తమకు కావాల్సినంత భూమిని కొని, అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారనేందుకు ఏబీఎన్ ఎండీ ఆర్కే నిర్వహించిన తాజా ఇంటర్వ్యూనే నిలువెత్తు నిదర్శనం.
ఒకప్పుడు ఎకరా రూ.25 లక్షలున్న భూమి, నేడు రూ.3 కోట్లకు విక్రయించుకోవచ్చనే దురాశే వాళ్ల కన్నీళ్లకు కారణమైంది. దురాశ దుఃఖానికి చేటు అంటే …ఇదే కదా? అనే సెటైర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎకరా రూ.3 కోట్ల భూమి మళ్లీ రూ.25 లక్షలో, రూ.50 లక్షలకో పడిపోతుందనే బాధ తప్ప, రాజధాని తరలిపోతుందనే ఆవేదన కాదనేది స్పష్టంగా తమ మనసులో మాటను అమరావతి ఉద్యమకారులే బయట పెట్టుకోవడం శుభపరిణామం. అది కూడా వాళ్ల ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకుని మోసే మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అమరావతి రాజధాని ఉద్యమం వెనుక బండారాన్ని బయట పెట్టుకోవడం మరో విశేషం. నిజానికి ఉన్న లక్షణం ఇదే. ఈ ఇంటర్వ్యూ వైసీపీకి ఓ ఆయుధం ఇచ్చినట్టైంది.