నాడు అనిత‌పై, నేడు బాబూరావుపై…!

విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల‌బాబూరావు అవినీతికి వ్య‌తిరేకంగా సొంత పార్టీ శ్రేణులు రోడ్డెక్క‌డం వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. వేలాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుడు త‌మ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అవినీతిని నిర‌సిస్తూ భారీ…

విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల‌బాబూరావు అవినీతికి వ్య‌తిరేకంగా సొంత పార్టీ శ్రేణులు రోడ్డెక్క‌డం వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. వేలాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుడు త‌మ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అవినీతిని నిర‌సిస్తూ భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలో టీడీపీ హ‌యాంలో పాయ‌క‌రావుపేట నుంచి అధికార పార్టీ త‌ర‌పున వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం ఆమె తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు.

గ‌తంలో అనిత టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఇష్టానుసారం అవినీతికి పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. స‌రిగ్గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముంగిట ఆమెకు వ్య‌తిరేకంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నా, రాస్తారోకోలు నిర్వ‌హించారు. అనిత‌కు తిరిగి టికెట్ ఇస్తే తామే ఓడిస్తామ‌ని చంద్ర‌బాబుకు సొంత పార్టీ నాయ‌కులే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో పాయ‌క‌రావుపేట నుంచి మ‌రో జిల్లాకు ఆమెను మార్చాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ పాయ‌క‌రావుపేట‌లో టీడీపీ గెల‌వ‌లేక‌పోయింది. వైసీపీ త‌ర‌పున గొల్ల బాబూరావు గెలుపొందారు.

గొల్ల బాబూరావు తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌ల‌ను సొంత పార్టీ నుంచి ఎదుర్కొని, నాటి ఎమ్మెల్యే అనిత‌ను గుర్తు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంగ‌తి ఏంటంటే…2019 ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు మూడు నెల‌ల ముందు అనిత‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. కానీ గొల్ల బాబూరావు విష‌యంలో అంత స‌మ‌యం తీసుకోలేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి స‌గం కాలాన్ని పూర్తి చేసుకున్న ప‌రిస్థితుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకోవ‌డం ఆ పార్టీకి ఆందోళ‌న క‌లిగిస్తోంది.

పెదగుమ్ములూరు నుంచి వెయ్యిమందితో జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. జాతీయ రహదారిపైకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో  ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కొంద‌రు రహదారిపై బైఠాయించారు. గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌పై అభిమానాన్ని చాటుకున్నారు ‘జగన్‌ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు’ అంటూ నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కార్యక్ర‌మం ఎస్‌.రాయ‌వ‌రం ఎంపీపీ బొలిశెట్టి శార‌దాకుమారి, ఆమె భ‌ర్త గోవింద‌రావు నేతృత్వంలో జ‌ర‌గ్గా జెడ్పీటీసీ స‌భ్యురాలు కాకర దేవి, వైసీపీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

తిరుమల వెంకన్న దర్శనానికి ఇచ్చే లేఖలకూ కూడా గొల్ల బాబూరావు డ‌బ్బు తీసుకుంటున్నార‌ని సొంత పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారంటే, ఆయ‌న గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికైనా అక్క‌డ పార్టీ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు టీడీపీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో లేదో చూడాలి.