పాజిటివా, నెగిటివా కాదు. ఇన్నాళ్లకి తనకి పేరొచ్చిందని సంబరపడిపోతున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. తన పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోందని అనుకుంటున్నారు. ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో తన మాటల్ని అందరూ వల్లె వేస్తున్నారని, తిట్టినా, పొగిడినా.. జనాల నోళ్లలో తాను నానిపోతున్నాననే భ్రమలో ఉన్నారు. మహిళలు తిట్టుకున్నా మందుబాబుల సపోర్ట్ మాకేనంటూ పొంగిపోతున్నారు.
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తర్వాత వరుసగా ప్రముఖుల్ని కలుస్తూ, టీవీ చర్చల్లో చంద్రబాబుని తిడుతూ కాస్త లైమ్ లైట్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా డల్లయ్యారు. ఆమధ్య తిరుపతిలో అమిత్ షా తో మొట్టికాయలు తిన్న తర్వాత సోము పదవి ఊడిపోతుందనే వార్త కూడా చర్చలోకి వచ్చింది.
కానీ అనుకోకుండా, అనూహ్యంగా ఒక్కసారిగా సోము వీర్రాజు తెరపైకి వచ్చారు. తారాజువ్వలా పైకి దూసుకెళ్లారు. ఏపీలో బీజేపీ చేపట్టిన ప్రజా ఆగ్రహ సభ అనేది ఎంతమందికి తెలుసో కానీ.. అందులో వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ మాత్రం జనమందరికీ చేరిపోయాయి. కేటీఆర్ కౌంటర్ తో అటు తెలంగాణ సమాజం కూడా చీప్ లిక్కర్ వ్యవహారంపై దృష్టిసారించింది. దేశంలో ఏ బీజేపీ నేత కూడా ఇలాంటి కామెంట్లు చేయలేదు కాబట్టి దేశవ్యాప్తంగా సోము వీర్రాజు పేరు మారుమోగింది.
తాగుబోతులు దగ్గరవుతున్నారోచ్..!
బీజేపీది ఎంత అల్ప సంతోషం అంటే.. ఇప్పుడు తాగుబోతులు తమ పార్టీకి మద్దతిస్తున్నారంటూ సంబరపడిపోతున్నారు. తాము అధికారంలోకి వచ్చేది లేదు, చీప్ లిక్కర్ ని 50 రూపాయలకి ఇచ్చేది లేదు అని ఆ పార్టీనేతలకి తెలుసు. అయినా కూడా వీర్రాజు మాటలతో తాగుబోతుల్లో ఓ ఆలోచన వచ్చిందని అనుకుంటున్నారు. అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు.
పరువు పోయింది కదయ్యా, అలా ఎలా మాట్లాడావంటూ వీర్రాజు దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే.. పోతే పోయింది అందరికీ తానున్నానని తెలిసిందంటూ ఫోజులు కొడుతున్నారట. లేకపోతే ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేయాలన్నా, దిష్టి బొమ్మలు తగలబెట్టాలన్నా.. మాటలా…! ఒక్క దెబ్బకి రాష్ట్రవ్యాప్తంగా మహిళా లోకం వీర్రాజు కామెంట్లతో ఆయన బ్యానర్లకి చెప్పుల దండలు వేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టింది. ఎలాగోలా, ఇలా తాను పాపులర్ అయ్యానని సంబరపడుతున్నారట వీర్రాజు.
చీప్ లిక్కర్ కామెంట్లు బయటకొచ్చిన తర్వాత కొత్త ఉత్సాహంతో ప్రతి రోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాలో కనపడేందుకు తాపత్రయ పడుతున్నారు వీర్రాజు. తనకి సారాయి వీర్రాజు అనే పేరు పెట్టారని తానే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీర్రాజు అలియాస్ సారాయి వీర్రాజు అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగిపోతోందని పరోక్షంగా సంబరపడుతున్నారు.
చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో తన పరువుతో పాటు, పార్టీ పరువు కూడా బజారుకీడ్చిన ఈ అల్పసంతోషి ఇంకెప్పటికి వాస్తవాలు తెలుసుకుంటారో ఏమో..?