త్వరలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న యూపీ విషయంలో వివిధ సర్వేలు దాదాపు ఒకే మాటను చెబుతున్నాయి. యూపీలో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని ఇవి అంచనా వేస్తున్నాయి. అయితే మెజారిటీ మాత్రం భారీగా తగ్గిపోతుందట. గత పర్యాయం 300లకుపైగా అసెంబ్లీ సీట్లలో నెగ్గిన బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈ సారి అటు ఇటుగా రెండు వందల సీట్లలో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఈ సర్వేలు చెబుతున్నాయి.
మొన్న ఒక సర్వే ఈ మాటే చెప్పింది. ఇప్పుడు ఏబీపీ సర్వే కూడా అదే మాటే చెబుతూ ఉంది. ఏబీపీ సర్వే ప్రకారం బీజేపీకి 212 నుంచి 224 సీట్ల వరకూ రావొచ్చట! సమాజ్ వాదీ పార్టీ బాగానే పుంజుకుందని.. ఆ పార్టీ నూటాభై నుంచి నూటరవై సీట్ల వరకూ సాధించవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.
ఈ అంచనాల వరకూ బాగానే ఉన్నాయి కానీ.. దేశంలో పొలిటికల్ ట్రెండ్ ను బట్టి చూస్తే ఇవంత నమ్మశక్యంగా అనిపించవు. సంచలన స్థాయి సీట్లను సాధించిన పార్టీలేవీ రెండోసారి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బయటపడిన దాఖలాలు కనపడవు. ఒకసారి సెన్షేషన్ సృష్టించిన పార్టీలు రెండోసారి కూడా అదే స్థాయి విజయాలను సాధిస్తున్న దాఖలాలే ఉన్నాయి.
2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ సునామీ లాంటి విజయాన్ని సాధించింది. 2019కి ఆ హవా పెరిగిందే తప్ప బోటాబోటీగా ఏమీ నెగ్గలేదు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి సారి సునామీ స్థాయి విజయాన్ని సాధించిన ఆప్, ఆ తర్వాతి ఎన్నికల్లో కూడా అలాంటి సునామీనే సృష్టించింది. ఈ పరంపరను గమనిస్తే.. యూపీలో బీజేపీ నెగ్గితే క్రితం సారి లాగానే నెగ్గుతుందనుకోవాలి. లేకపోతే అదే వేవ్ ఇంకో పార్టీ వైపుకు దక్కినా పెద్ద ఆశ్చర్యం లేదు. క్రితం సారి 300 వచ్చాయి కాబట్టి.. ఈ సారి 200 వస్తాయనే లెక్కలు మాత్రం ఉత్తుత్తివే అనుకోవచ్చు.
బీజేపీకి గతం నాటి ఊపే ఉంటే.. ఈ సారి కూడా మూడు వందల సీట్లకు తగ్గకపోవచ్చు. ఆ ఊపు లేకపోతే మాత్రం.. అధికారానికి ఆ పార్టీ దూరం కావడంలో వింత లేదు.