దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సెకెండ్ వేవ్ దాదాపు పూర్తి అయిపోతోందనుకుంటున్న దశలో మళ్లీ నంబర్లు పెరుగుతుండటం గమనార్హం. గత ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా కలిసి దాదాపు రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4.32 లక్షలుగా ఉంది. యాక్టివ్ కేసుల లోడు తగ్గాల్సిన దశలో, తగ్గడం సంగతి అలా ఉంచి.. ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశంగా మారుతోంది.
రాష్ట్రాల వారీగా చూస్తే.. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసుల సంఖ్య భారీ స్థాయికి చేరుతూ ఉండటం గమనార్హం. ప్రత్యేకించి కేరళలో గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలకు పైగా ఉంది! రికవరీలు పోనూ.. అక్కడ రెండు వేలకు పైగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.18 లక్షలుగా ఉంది.
అలాగే మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత ఇరవైనాలుగు గంటల్లో రెండు వేలకు పైగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కడ లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది.
ఊరట ఏమిటంటే.. కర్ణాటక, తమిళనాడు, ఏపీల్లో కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గుముఖంలోనే కొనసాగుతూ ఉండటం. కర్ణాటకలో యాక్టివ్ కేసుల లోడు బాగా తగ్గింది. ఒక దశలో దేశంలోనే అత్యధిక స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదైన రాష్ట్రం అది. పతాక స్థాయిలో ఐదు లక్షల కరోనా యాక్టివ్ కేసులను చూసింది కర్ణాటక.
ప్రస్తుతం అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య ముప్పై వేల స్థాయిలో ఉంది. తమిళనాడులో కూడా ముప్పై వేల స్థాయిలో మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 25 వేల వరకూ ఉంది. రోజువారీ కేసుల నమోదు విషయంలో కూడా ఈ మూడు రాష్ట్రాల్లో అవరోహన క్రమం కొనసాగుతూ ఉంది.