బెబో ‘బైబిల్’: కరీనాకు ఇంకో పేరు దొరకలేదా..?

సైజ్ జీరో అందాలతో కనికట్టు చేసిన కరీనా కపూర్ ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి. 40 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గకుండా కనిపించే కరీనా ఇటీవల తన మాతృత్వపు అనుభవాల్ని, అనుభూతుల్ని…

సైజ్ జీరో అందాలతో కనికట్టు చేసిన కరీనా కపూర్ ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి. 40 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గకుండా కనిపించే కరీనా ఇటీవల తన మాతృత్వపు అనుభవాల్ని, అనుభూతుల్ని గుదిగుచ్చి పుస్తక రూపంలో తీసుకొచ్చింది. 

ఇదో కొత్త రకం బిజినెస్ ఐడియా అనేవాళ్లు ఎలాగూ ఉంటారు, కానీ సెలబ్రిటీల సంగతులు తెలుసుకోవాలని కుతూహలం సామాన్యుల్లో ఉండబట్టి వారం రోజుల్లోపే పుస్తకం హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో చాలామంది ఈ పుస్తకాన్ని కొనుక్కుని సోషల్ మీడియాలో సెల్ఫీలు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ పుస్తకానికి పెట్టిన పేరు విమర్శలకు తావిస్తోంది.

'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనేది ఆ పుస్తకానికి పెట్టిన పేరు. అయితే బైబిల్ అనే పదమే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. క్రిస్టియన్ సంఘాలు దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మహారాష్ట్రలోని బీద్ ఏరియాలో ఆల్ఫా ఒమెగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే ఈ వ్యవహారంపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కరీనా కపూర్ తో పాటు, పుస్తక రచనలో భాగస్వామి అయిన అదితి షా, పబ్లిషర్స్ గా వ్యవహరించిన జుగ్గెర్నాట్ బుక్స్ పై కేసు పెట్టారు.

మత పరమైన మనోభావాలను కించపరిచేలా పుస్తకానికి టైటిల్ పెట్టారంటూ ఐపీసీ సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేయాలని కోరారు. బైబిల్ అనే పేరుకి చాలా పవిత్రమైన అర్థం ఉందని, అలాంటి పేరుని ఇలాంటి కమర్షియల్ వ్యవహారాలకు ఉపయోగించడం సరికాదని అన్నారాయన.

అంత తేలిగ్గా కేసు పెడతారా..?

సెలబ్రిటీలపై అంత త్వరగా కేసు పెడతారా అనే అనుమానాన్ని నిజం చేస్తూ.. బీద్ పోలీసులు కరీనా కపూర్ పై కేసు పెట్టడానికి నిరాకరించారు. మా స్టేషన్ పరిధి కాదంటూ తప్పించుకున్నారు. 

ముంబైలో కేసు పెట్టాలని సదరు క్రిస్టియన్ సంస్థకు సూచించారు బీద్ పోలీసులు. ఈ వ్యవహారాన్ని అక్కడితో ఆపేయాలని చూశారు.

మండిపడుతున్న క్రిస్టియన్ సంఘాలు..

ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పేరుతో పుస్తకం విడుదల చేయడాన్ని పలు క్రిస్టియన్ సంఘాలు తప్పుబడుతున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, పుస్తకం పేరు మార్చుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలు పెట్టారు. 

ముంబైలో కూడా కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయా సంఘాల నేతలు. మొత్తమ్మీద.. కంటెంట్ తో కాకపోయినా, టైటిల్ తో అయినా కరీనా పుస్తకం ఇలా మరింత పాపులర్ అవుతోంది.