సంక్షేమ పులిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వారీ చేస్తున్నారు. ఇప్పటికి జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇక మూడేళ్లు మిగిలి ఉంది. రెండేళ్లు పూర్తయ్యే సరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన నెలకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. మరోవైపు ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు జగన్ సర్కార్ సర్కస్ పీట్లు చేయాల్సి వస్తోంది.
ఎలాగోలా రెండేళ్లలో, అది కూడా కరోనా మహమ్మారి పంజా విసిరిన విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు విరివిగా డబ్బు పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం శభాష్ అనిపించుకుంది. మరోవైపు మరికొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను నెమ్మదిగా మూటకట్టు కుంటున్న వాతావరణం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. వైఎస్సార్ కుటుంబం అంటే మాట తప్పదు, మడమ తిప్పదు అనే పేరు ఉంది. దానిని నిలబెట్టుకోవడం అభిమానులు ముద్దుగా పిలుచుకునే పులివెందుల పులి వైఎస్ జగన్‌కు పెద్ద సవాలే అని చెప్పక తప్పదు.
సంక్షేమ పథకాల అమలు తప్పుకాదు. అప్పుచేసి పప్పుకూడు మంచిది కాదనేదే అందరి అభిప్రాయం. పథకాల అమలుకు డబ్బు జనరేట్ చేయాల్సిన కర్తవ్యాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించిందని అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలు
తాజాగా కేంద్ర ప్రభుత్వం 11% డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ పెంపుదల వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీగా ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జగన్ సర్కార్‌పై ఒత్తిడి పెంచిందని చెప్పొచ్చు. 2018లో చంద్రబాబు హయాంలో రావాల్సిన డీఏను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించారు. 2021 జనవరి 1 నుంచి తీసుకోవాలని జగన్ ఆర్భాటంగా ప్రకటించిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. కానీ బిల్లులు చేసినప్పటికీ డబ్బు మాత్రం జమ కాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసహనం కలిగిస్తోంది.
కోవిడ్ కారణంగా 2020 జనవరి నుంచి మూడు డీఏలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సాకుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలోనే నడించింది. తాము కూడా డీఏలను నిలుపుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలకు ముందు ఒక్క డీఏ కూడా పెండింగ్ పెట్టనని ఇచ్చిన హామీ ఏమైందని జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రశ్నిస్తు న్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో అరియర్స్‌తో సంబంధం లేకుండా మూడు డీఏలను ఒకేసారి కలిపి ఇచ్చింది. మరి ఇప్పుడు కేంద్రం బాటలోనే జగన్ ప్రభుత్వం ఎందుకు నడవలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు 2018 నుంచి రావాల్సిన పీఆర్‌సీపై జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అంతకు ముందు కమిటీ వేసిన రెండేళ్లలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని పీఆర్‌సీ ఇచ్చే వాళ్లని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పుడు మూడేళ్లవుతున్నా పీఆర్‌సీ విషయమై అతీగతీ లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా సీపీఎస్ రద్దు అంశం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకటో తేదీకి జీతాలనేవి భవిష్యత్‌లో మరిచిపోవాల్సిందే అనే అందోళన ఉద్యోగుల్లో ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా తయారైందని ప్రభుత్వ చెల్లింపులే కథలుకథలుగా చెబుతున్నాయని ఉద్యోగులు అంటున్నారు. అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మూడు నెలలకు కూడా పీఎఫ్ అమౌంట్ జమకాలేదని చెబుతు న్నారు. ఒకప్పుడు వారం, పదిరోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ జమ అయ్యేదని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ( ఏపీజీఎల్ఐ ) బాండ్ మెచ్యూరిటీ అయినప్పటికీ డబ్బు మాత్రం ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాల ఆవేదన మరోలా ఉంది. తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాడాల్సిన దశ నుంచి ప్రతినెలా ఒకటో తేదీకి జీతాలైనా వేయండి జగన్ సార్ అని వేడుకునే దుస్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల్లో కూడా తాము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు లబోదిబోమంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో విజయవంతంగా ముందుకెళుతోందని సంబరపడుతోంది. తమ రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలుకు రూ.1,00,116.36 కోట్ల నగదును నేరుగా లబ్ధిదారులకు అందజేసినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. గత రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడాన్ని ఎవరూ కాదనలేదు. అయితే ఎక్కడెక్కడి సొమ్మునంతా సంక్షేమ పథకాలకే ఖర్చు చేయడం వల్ల, మిగిలిన అభివృద్ధి పనులు ఆగిపోయాయనేది కూడా పచ్చి నిజం. కనీసం పల్లెల్లో చిన్న సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి కూడా లేదు.
ఒకవైపు కోవిడ్ సాకు చూపి తమకు రావాల్సిన బకాయిలను పెండింగ్‌లో ఉంచిన జగన్ ప్రభుత్వం, మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు మాత్రం లక్షల కోట్లను ఎలా ఖర్చు చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. మరోవైపు ఇదే సొమ్మును సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ఉంటే, రాష్ట్రంలోని ప్రతిగామం పంటలతో సస్యశ్యామలం అయ్యేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కనీసం ఒక్క సాగునీటిని కూడా పూర్తి చేయలేని దుస్థితిలో రాష్ట్రం ఉందంటున్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా కనీసం ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉందంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన లక్ష కోట్లు… కేవలం అనుత్పాదక రంగంపై కావడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయడం లేదనే వాదన లేకపోలేదు. ప్రభుత్వ సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని ఆవేదనతో విమర్శించే వాళ్లు లేకపోలేదు. మరోవైపు సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న వారు కూడా ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పుబెల్లాల మాదిరిగా పంచి పెడుతోందని విమర్శిస్తుండడం గమనార్హం. ఆర్థికంగా తన కష్టనష్టాలేవైనా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసి తీరాల్సిందే. ఒకవేళ ఒక్క నెల నిలిపివేసినా సంక్షేమ పథక లబ్ధిదారుల్లో వ్యతిరేకత వస్తుంది.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పులిపై స్వారీ చేసినట్టుగా ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వారీని ఆపితే మాత్రమే సమస్యే. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో ఆర్థిక ఇబ్బందులను జగన్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేది పెద్ద సవాలే. అన్ని వర్గాల్లో ఆదరణను నిలుపుకునేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.