జగన్ సర్కార్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించిన విశాఖ జిల్లా నర్సిపట్నం ఏరియా ఆస్పత్రి మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్‌పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. డాక్టర్ సుధాకర్ ఉద్దేశ పూర్వకంగానే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి డైరెక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై విషం గక్కాడనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి జగన్ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకొంది.
ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ ద్వారా స్పందించాడు. యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు స్పందించడం చూస్తే….కరోనాను రాజకీయంగా వాడుకోవాలనే ఉత్సాహం ఆయన ట్వీట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్-95 మాస్క్‌లు లేవన్న విషయాన్ని దృష్టికి తీసుకు వస్తే.. సమస్యను పట్టించుకోకుండా డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించాడు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎన్-95 మాస్క్‌లు లేవనే విషయాన్ని ఏ విధంగా తెలియజేయాలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు తెలియదా? మీడియా ముందుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి, ప్రభుత్వ పరువు తీయడం చంద్రబాబును దిగ్భ్రాంతికి గురి చేయలేదా? పార్టీల కంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు ముఖ్యమనే విషయం తెలియకుండానే 40 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారా? ఏపీ ప్రజలు చెల్లిస్తున్న పన్నును జీతంగా తీసుకుంటూ…ఉద్దేశ పూర్వకంగా ఇక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కించపరచడమే కాకుండా, పక్క రాష్ట్రాన్ని పొగడడం విజ్ఞతేనా?
ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు ఏపీలో వ్యవస్థలను నాశనం చేయాలనుకుంటున్నాడా? నిబంధనలకు విరుద్ధంగా, బాధ్యతా రహితంగా మాట్లాడిన డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయకుండా సన్మానం చేస్తారా?
కరోనాపై పోరాడుతున్న డాక్టర్లను ఇలా అగౌర పరిస్తే ఎలా? ఈ క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్లను, వైద్య సిబ్బందిని జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం ఉందని చంద్రబాబు ట్వీట్ చేయడం…ఆయనలోని నటుడిని బయటికి తీసుకొచ్చింది. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై బాబు ప్రేమ అంతా యాక్టింగ్‌లో భాగమే అనేందుకు ఈ ట్వీటే నిదర్శనం.