కరోనా కట్టడికి మూడు వారాల లాక్ డౌన్ పీరియడ్ లో రెండు వారాలు దాటిపోయాయి. మూడోవారం ప్రారంభమైంది. జనాలు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అదే టైమ్ లో లాక్ డౌన్ పొడిగిస్తారేమో అన్న అనుమానాలు కూడా జనాల్లో వుండనే వున్నాయి. మూడు రోజుల నుంచి లాక్ డౌన్ పొడిగింపు మీద మెల మెల్లగా క్లారిటీ వస్తూంది.
ముందుగా తెలంగాణ సిఎమ్ లాక్ డౌన్ ను పొడిగించాలని, కేంద్రం నిర్ణయం ఎలా వున్నా, తాను మాత్రం లాక్ డౌన్ కొనసాగిస్తాననే సూచనలు ఇచ్చారు. ఆ మరునాడు. మరికొంత మంది ముఖ్యమంత్రులు ఇదే స్వరం వినిపించారు.
మరో రోజు దాటిన తరువాత మోడీ కూడా వివిధ పార్టీల శాసనసభా పక్ష విప్ లతో మాట్లాడినపుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారన్న వార్తలు వచ్చాయి. ఇదే రోజున దేశంలోని వర్తక సంఘాలకు ప్రాతినిధ్యం వహించే సంఘ ప్రతనిధులు కూడా మోడీకి లేఖ ఇచ్చారు. కరోనా కట్టడికి మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, అవసరం అయితే పొడిగించడం మంచిదే అన్న సూచన చేసారు.
ఇవన్నీ చూస్తుంటే లాక్ డౌన్ పొడిగింపు కోసం ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దేశం మొత్తం పొడిగించకుండా, కొన్ని జిల్లాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దేశం మొత్తం మీద ఓ పాతిక శాతం జిల్లాలకు మినహాయింపు ఇచ్చినా ఇవ్వొచ్చు. ఆంధ్రలో కనీసం నాలుగయిదు జిల్లాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం వుంది.
అయితే మినహాయింపు ఇచ్చినా 144 సెక్షన్ లాంటివి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లు, మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు లాంటివి ఇంకా లాక్ డౌన్ లోనే వుండే అవకాశం వుంది. అలాగే పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఇంకా కొన్నాళ్ల లాక్ డౌన్ లో వుండే అవకాశం వుంది.
ఆంధ్రలో లాక్ డౌన్ విషయంలో సిఎమ్ జగన్ ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదు. కేసిఆర్ మాదిరిగా ఆయన ఖరాఖండీగా ఏ సంగతి ఇప్పటి వరకు ప్రకటించలేదు. బహుశా ఆయనకు రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లో వుంచడం అంతగా ఇష్టం వున్నట్లు కనిపించడం లేదు.
ఏమైనా జనం కూడా మరో రెండు వారాలు లాక్ డౌన్ వుంటుందనే భావనకు చాలా వరకు వచ్చేసారు. అదే సమయంలో ప్రపంచం మొత్తం పోకడలు చూస్తున్నారు. మన దేశం కేసులు చూస్తున్నారు. మన దేశం చాలా వరకు కాస్త రక్షిత ప్రదేశంగానే కనిపిస్తోంది. దీనికి కారణం లాక్ డౌన్ అనే జనం పూర్తి నమ్మకంతో వున్నారు. అందుకే లాక్ డౌన్ పొడిగింపు కు అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు దాదాపు రెడీ అయిపోతున్నారు.