రోజా మళ్లీ జోష్ పెంచింది. లాక్‌డౌన్ కారణంగా చిత్తూరు జిల్లాలో తన సొంత నియోజకవర్గం నగరిలో ఉంటూ….తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు పట్టించుకుంటూ బిజీగా ఉన్న రోజా….తీరిక చేసుకుని మీడియా ముందుకొచ్చారు. రావడం రావడంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై పంచ్‌లతో పిడిగుద్దులు కురిపించారు. రోజా పంచ్‌లకు బాధతో బాబు కెవ్వుమని అరిచేలా ఉన్నాయి.
చంద్రబాబునాయుడు తనను గెలిపించిన ప్రజలకు గాలికి వదిలేసి ఆంధ్రా నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షాల నుంచి సలహాలు తీసుకోకుండా జగన్ సర్కార్ అహంభావంతో వ్యవహరిస్తోందని బాబు చేసిన విమర్శకు రోజా దిమ్మ తిరిగేలా జవాబిచ్చారు. చంద్రబాబు సలహాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అవసరమేమో గానీ, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కాదని తేల్చి చెప్పారు.
కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శంగా ఏపీ సీఎం నిలిచారని ఆమె కొనియాడు. ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ఈ వ్యవస్థను జాతీయ మీడియా ప్రశంసిస్తూ కథనాలు రాసిన విషయాన్ని రోజా గుర్తు చేశారు. ఏపీలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే వాలంటీర్ల సైన్యం ఉందని, దాని ద్వారా దేశవిదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆచూకీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కరోనా నివారణకు జగన్ సర్కార్ ఆదర్శవంతమైన పాలన సాగిస్తోందని రోజా ప్రశంసించారు.