హైటెక్ సిటీ కట్టింది నేనే, ఆమాటకొస్తే భారత దేశానికి సాఫ్ట్ వేర్ బూమ్ తెచ్చింది నేనే అంటారు చంద్రబాబు. విజన్ ట్వంటీ ట్వంటీని అబ్దుల్ కలాంకి చెప్పింది కూడా తనేనని అభాసుపాలయ్యారు కూడా. అలాంటి బాబు.. విశాఖ మెడ్ టెక్ జోన్ కి క్రెడిట్ వస్తే ఎలా వదిలేస్తారు చెప్పండి. అవును.. దాని వెనకాలుంది నేనే, అది నా పుణ్యమేనని సెలవిస్తున్నారు బాబోరు.
ఆ “దార్శనికుడి” దయవల్లే విశాఖ మెడ్ టెక్ జోన్ ఏర్పడిందని, దాని వల్లే ఇప్పుడు కరోనా టెస్ట్ కిట్ లు తయారయ్యాయని టీడీపీ ట్వీటుతోంది. విశాఖ మెడ్ టెక్ జోన్ లో తయారు చేసిన వెయ్యి కిట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది జగన్ సర్కారు. ఈ కిట్ల ద్వారా 55 నిమిషాల్లో అంటే గంటలోపే రిజల్ట్ తేలిపోతుంది. ఒక్కో కిట్ ద్వారా 20 వరకు పరీక్షలు చేయొచ్చు. ఇంకో వారంలో 10వేల కిట్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పచ్చ బ్యాచ్ కన్ను మెడ్ టెక్ జోన్ పై పడింది. వాస్తవానికి మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటైంది. అప్పటి చంద్రబాబు సర్కారు 270 ఎకరాలు దీని కోసం కేటాయించింది. వైద్య పరికరాల తయారీ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుండటంతో.. మెడ్ టెక్ జోన్ లో ఆ దిశగా ప్రయోగాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే టెస్ట్ కిట్లు రెడీ అయ్యాయి.
వాస్తవానికి సీఎం జగన్ ఆదేశాలతోటే విశాఖ మెడ్ టెక్ జోన్ లో టెస్టింగ్ కిట్లు తయారీ ఊపందుకొంది. కొవిడ్-19 పరీక్షలు సకాలంలో జరగకపోవడం, ఫలితాలు తేలడానికి ఒకటీ రెండు రోజులు సమయం పట్టడం.. వంటివన్నీ ఏపీలో కరోనా విజృంభణకు పరోక్ష కారణాలయ్యాయి. దీంతో సీఎం జగన్ టెస్టింగ్ కిట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని, మెడ్ టెక్ జోన్ తో ఏమైనా సాధ్యమవుతుందా అని కొన్నిరోజుల క్రితం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని విచారించారు.
ఆ తర్వాత మంత్రి చొరవతో మెడ్ టెక్ జోన్ లోని పలు కంపెనీలు టెస్టింగ్ కిట్లపై దృష్టిసారించాయి. అనుకున్నట్టుగానే రోజుల వ్యవధిలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. అది కూడా అత్యంత వేగంగా పరీక్ష ఫలితం చెప్పే కిట్లు అందుబాటులోకి రావడం ఏపీకే గర్వకారణంగా నిలిచింది. దీంతో చంద్రబాబు ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. మెడ్ టెక్ జోన్ తెచ్చింది నేనే కాబట్టి, టెస్టింగ్ కిట్ల తయారీ ఘనత కూడా తన ఖాతాలోనే వేయాలంటున్నారు బాబు.
అసెంబ్లీ నేనే కట్టించా, అందులో సమావేశాలు పెడుతున్నారు కదా అంటూ ఓవర్ యాక్షన్ చేసే చంద్రబాబు ఇప్పుడు కరోనాపై జరిగే పోరులో ఏపీ ప్రభుత్వం సాధించిన తొలి విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ముందు ముందు కరోనా యాంటీ డోస్ కూడా తన విజన్ వల్లే కనిపెట్టారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.