ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణ గుత్తా జ్వాలపై నెటిజన్లకు కోపమా? గుత్తా జ్వాల మాటల్లో చెప్పాలంటే…ఆమెకు నెటిజన్లు చాలా రకాల పిచ్చిపిచ్చి పేర్లన్నీ పెట్టారు. దీన్నిబట్టి నెటిజన్లకు గుత్తా జ్వాల అంటే చాలా కోపమని అర్థమవుతోంది. అయితే ఆమెపై ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు.
తాజాగా ఆమె ట్వీట్ అనేక అంశాలను ప్రస్తావించింది. లాక్డౌన్ సమయంలో చదువుకున్న వాళ్లే రోడ్లపై జాగింగ్ చేయడాన్ని గుత్తా తప్పు పట్టారు. లాక్డౌన్ పాటించని ఇలాంటి వాళ్ల వల్లే కరోనా వ్యాపించడానికి అవకాశం ఉందన్నారామె. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.
తనపై కొందరు జాత్యాంహకార మాటలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేసిన వీడియో వైరల్ అయిందని, దానిపై దేశంలో జాత్యాంహకారం పెరిగిపోయిందని సోషల్ మీడియాలో తాను కామెంట్ చేసినట్టు గుత్తా జ్వాల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమయ్యాక తనపై కొందరు నెటిజన్లు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు.
హాప్ కరోనా, చైనాకా మాల్, హాఫ్ చైనీస్, చింకీ తదితర పేర్లతో పిలవడం ప్రారంభించారని ఆమె అన్నారు. నెటిజన్లు అలా పిలవడానికి కారణం తన తల్లి చైనా దేశస్థురాలు కావడమే అన్నారు. తన తండ్రి తెలుగువాడని గుత్తా జ్వాల తెలిపారు. అందుకే తనను హాఫ్ కరోనా అని అంటున్నారని, ఇది ముమ్మాటికీ జాత్యహంకారమే అని ఆమె అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు గుత్తా తెలిపారు. సినిమాలు, షోస్ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నానని చెప్పడంతో పాటు ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.