కరోనా కట్టడి కోసం శానిటైజర్ల ఉపయోగాన్ని నొక్కిమరీ చెబుతున్నాయి ప్రభుత్వాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు శానిటైజర్లను ఉచితంగా అందిస్తుంటే.. పలు స్వచ్ఛంద సంస్థలు పేదలకు శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల శానిటైజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిల్లో ఆల్కహాల్ ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. 75 నుంచి 80శాతం ఆల్కహాల్ శానిటైజర్లలో ఉంటుంది. ఇక్కడే కొంతమంది మందుబాబులు కక్కుర్తి పడుతున్నారు. చేతులు శుభ్రం చేసుకోడానికి ఉపయోగించే ఈ శానిటైజర్లను తాగేస్తున్నారు.
లాక్ డౌన్ తొలినాళ్లలో మద్యం ఎక్కడపడితే అక్కడ దొరికేది. ఆ తర్వాత రోజురోజుకీ రేటు పెరిగిపోయింది. ఇప్పుడు బ్లాక్ లో ఎంత ఇస్తామన్నా మందు బాటిల్ పుట్టే పరిస్థితి లేదు. వైన్ షాపులు తెరిచే విషయంలో ప్రభుత్వాలు కూడా వెనకడుగేస్తున్నాయి. దీంతో కిక్కు కోసం చాలామంది శానిటైజర్లపై పడ్డారు. తమిళనాడులోని 35ఏళ్ల ఓ వ్యక్తి ఇలా శానిటైజర్ తాగి మృత్యువాత పడ్డాడు.
కోయంబత్తూర్ లో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ గా పనిచేసే బెర్నార్డ్ అనే వ్యక్తి రెండు వారాలుగా మందు కోసం తపిస్తున్నాడు. ఎక్కడా దొరక్కపోయే సరికి ఆఫీస్ లో దొరికిన శానిటైజర్ ని తాగేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను చనిపోయాడు. తమిళనాడులోనే గతంలో షేవింగ్ లోషన్ లో నీళ్లు కలుపుకొని తాగి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే.
శానిటైజర్ తయారీలో వాడే ఆల్కహాల్.. తాగేందుకు పనికిరాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మద్యంలో ఇథనాల్ వాడతారు. శానిటైజర్ల తయారీలో వాడేది ఐసో ప్రొపైల్. డిస్టిల్డ్ చేయని ఈ ఆల్కహాల్ ని తాగితే నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడంతో పాటు, అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాంతకం కూడా అని చెబుతున్నారు.
అయితే ఇవేవీ పట్టని మందుబాబులు కిక్ కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఓ దశలో కేరళలో కరోనా చావుల కంటే.. మందు దొరక్క నమోదైన ఆత్మహత్యల సంఖ్యే ఎక్కువ. దీంతో ఓ రకమైన మానసిక రుగ్మతలోకి వెళ్లిపోయిన మందుబాబులు ఆల్కహాల్ ఉంటుందనే కారణంతో శానిటైజర్లను తాగేస్తున్నారు. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.