కరోనా భయాల వేళ కోడి ధర పతనం అయ్యింది. ఇంకా లాక్ డౌన్ ను ప్రకటించక ముందు, కరోనా వచ్చేస్తోందనే భయాల మధ్యన చికెన్ తినడానికి చాలా మంది సంశయించారు. ప్రత్యేకించి ఓ మోస్తరు పట్టణాలు, పల్లెల్లో చికెన్ వల్ల కరోనా వస్తుందనే భయాల నేపథ్యంలో కోడి కొనేవాళ్లు లేకుండా పోయారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బ తింది. చివరకు అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఆ వ్యాపరస్తులకు. కిలో కోడి ఇరవై రూపాయలకు కూడా అమ్మారు. వంద రూపాయలు ఇస్తే ఒక పెద్ద లైవ్ బర్డ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయినా చికెన్ అమ్మకాలు అప్పుడు బాగా తగ్గిపోయాయి.
అయితే జనాలు జనాలు ఎక్కువ కాలం పాటు చికెన్ కు దూరంగా ఉండలేరు. మొదట్లో భయపడినా.. అప్పుడు చికెన్ వల్ల కరోనా రాదని ప్రభుత్వాలు, మీడియా చెప్పినా పట్టించుకోని ప్రజలు చివరకు చికెన్ కు దూరంగా ఉండలేకపోయారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నా.. ఉదయం పూట చికెన్ తీసుకెళ్లిపోతూ ఉన్నారు. దీంతో కోడి ధర మళ్లీ పుంజుకుంది!
ఒక దశలో కిలోచికెన్ కొన్ని చోట్ల యాభై రూపాయలకు పడిపోయింది. అయితే ఇప్పుడు కిలోచికెన్ ధర 150 రూపాయలకు చేరింది. ఇలా చికెన్ ధర మళ్లీ పెరిగింది. మరోవైపు పౌల్ట్రీల నుంచి కోళ్ల రవాణాకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు బాగా సాగుతున్నాయి. పౌల్ట్రీ వ్యాపారులు ఇప్పుడు కోలుకుంటున్నారు.