ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 05

కూతురికి 19 కుట్లు వేయించి జెసికా ఆసుపత్రి నుంచి యింటికి వచ్చేసరికి క్రిస్‌కు తోడుగా మైక్‌ కూర్చున్నాడు. విరిగిపోయిన తలుపును బాగు చేశాడు. జెసికా చలించిపోయింది. కూతుర్ని తన గదిలోకి పంపి మైక్‌తో ‘చూడు,…

కూతురికి 19 కుట్లు వేయించి జెసికా ఆసుపత్రి నుంచి యింటికి వచ్చేసరికి క్రిస్‌కు తోడుగా మైక్‌ కూర్చున్నాడు. విరిగిపోయిన తలుపును బాగు చేశాడు. జెసికా చలించిపోయింది. కూతుర్ని తన గదిలోకి పంపి మైక్‌తో ‘చూడు, ఇంత ఉపద్రవం జరుగుతూంటే బ్రాడీ ఎక్కడికి పోయాడో తెలియదు. కబురూ కాకరకాయా లేదు. అతను తిరిగి రావడం మన అందరి జీవితాల్నీ అతలాకుతలం చేసేసింది. అతని ప్రవర్తనతో విసిగిపోయాను. నిన్నెంతో మిస్‌ చేస్తున్నాను, నీకెలా వుందో కానీ’ అంది. మైక్‌ ‘నేనూ మిస్‌ చేస్తున్నాను. బ్రాడీ రాక మన ప్లాన్లని అప్‌సెట్‌ చేసింది.’ అన్నాడు. ఇద్దరూ ముద్దాడసాగారు. ఇంతలో డానా హఠాత్తుగా హాల్లోకి వచ్చింది. జెసికా తత్తరపడి క్రిస్‌ పడుక్కున్నాడో లేదో చూస్తానంటూ అతని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయింది. డానా మైక్‌తో నిర్మొగమాటంగా ‘నువ్వు మా జీవితాల్లోంచి తప్పుకుంటే అదే పదిమే. నువ్వు యిక్కడిక్కడే తచ్చాడుతూంటే మా నాన్న మాకు ఎన్నటికీ దక్కడు’ అంది.

ఆదివారం నాడు పొద్దున్న క్యారీ బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేస్తూ ‘నీకు టీ ఏది కావాలి? నీ ఫేవరేట్‌ బ్రాండ్‌ యార్క్‌షైర్‌ గోల్డ్‌ యిక్కడ దొరకదు మరి’ అంటూ జోక్‌ చేసింది. ‘నా ఫేవరేట్‌ బ్రాండ్‌ అదని నీకెలా తెలుసు?’ అని అడిగాడు బ్రాడీ చురుగ్గా. బ్రాడీ యింట్లో కెమెరాలు పెట్టి అతన్ని గమనించిన రోజుల్లో క్యారీకి ఆ విషయం తెలిసింది. పొరపాటున యిప్పుడు నోరు జారింది. అది గ్రహించుకుని ‘ఏమో అలా గుర్తుండి పోయింది. బహుశా నువ్వు లాంగ్లీకి వచ్చినపుడు తాగి వుంటావు.’ అంది. ‘నేనక్కడికి వచ్చినపుడు టీ తాగలేదే!’ అన్నాడు బ్రాడీ. వెంటనే క్యారీ మాట తప్పించాలని చూసింది.

కానీ బ్రాడీ జరిగినవన్నీ సింహావలోకనం చేసుకున్నాడు. క్యారీ తనపై గూఢచర్యం చేసిందని, దానిలో ఏదీ దొరక్కపోవడంతో యిప్పుడు యీ స్నేహం నటిస్తోందని అర్థం చేసుకున్నాడు. వెళ్లి చాటుగా వెతికితే రివాల్వర్ కనబడింది. తన దగ్గర పెట్టుకుని ‘నువ్వు మా యింట్లో కెమెరాలు పెట్టి చూశావు కదా’ అని క్యారీని అడిగాడు. గతిలేక ఆమె ‘అవును, నా వృత్తిధర్మంలో భాగంగా చేశాను.’ అని ఒప్పుకుంది. ‘నా మీద అనుమానం ఎందుకు కలిగింది?’ అని రౌద్రంగా అడిగాడు. 

క్యారీ భయపడి, ఎందుకైనా మంచిదని  రివాల్వర్ కోసం లేవబోయింది. వెంటనే బ్రాడీ తన జేబులోంచి  రివాల్వర్ తీసి చూపించి, ఆమెను కుర్చీలో కూర్చోమన్నాడు. తను ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్నాడు. ఉన్నదున్నట్లు చెప్పేస్తే మంచిదనుకుంటూ క్యారీ తన ఏజంటు అమెరికన్‌ యుద్ధఖైదీ తమవైపు మారిపోయాడని చెప్పాడని, అది బ్రాడీయే అని తన అనుమానమని చెప్పేసింది. ‘నేను టెర్రరిస్టునని నీ ఉద్దేశమా?’ అని బ్రాడీ ఆశ్చర్యపడ్డాడు.  రివాల్వర్  తీసి మధ్యలో ఉన్న బల్ల  మీద పెట్టి ‘నీకు సందేహాలేవైనా వుంటే అడుగు’ అన్నాడు.
 
క్యారీ ధైర్యం తెచ్చుకుంది. వరసగా ప్రశ్నలడిగింది. హమీద్‌కు బ్లేడ్‌ యిచ్చినది నీవేనా అని అడిగితే అతను లేదన్నాడు. మాటిమాటికీ గరాజ్‌కి ఎందుకు వెళతావు అని అడిగితే ‘ఒంటరి జీవితం గడిపేటప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. పక్కన బైబిల్‌ లేదు. అందువలన నేను ముస్లిముగా మారాను. ఎవరికీ యిబ్బంది కలగకుండా అక్కడకు వెళ్లి నమాజ్‌ చేస్తాను అన్నాడు. వేళ్లు కదిపే అలవాటు గురించి అడిగితే జపమాల తిప్పడం వలన ఆ అలవాటు వచ్చిందని, ఎవరికీ ఏ సంకేతాలూ యివ్వటం లేదని చెప్పాడు.

‘ఐసా ఎవరు?’ అని అడిగితే ‘నా సెక్యూరిటీ గార్డుల్లో ఒకడు. హమీద్‌ క్రూరంగా ప్రవర్తిస్తే అతను నా పట్ల మంచిగా వుండేవాడు.’ అని చెప్పాడు. టామ్‌ వాకర్‌ను చంపినది నేనే, అతన్ని చంపకపోతే నిన్ను చంపుతానని నజీర్‌ చెప్పాడు. ఇక గత్యంతరం లేకపోయింది అన్నాడు. నజీర్‌ను కలవలేదని అబద్ధం చెప్పేవేం అంటే ‘అతను నా పట్ల దయగా ప్రవర్తించాడు. చంపలేదు. దానితో అతనంటే యిష్టం కలిగింది. నేను అతని అనుయాయిగా మారలేదు. అయినా కలిశానని, యిష్టమని చెపితే అందరూ నా గురించి చెడుగానే అనుకుంటారు. అందుకని దాచాను.’ అన్నాడు.

ఇంత చెప్పినా క్యారీ కన్విన్స్‌ కాలేదు. నా ఏజంటు చెప్పిన యుద్ధఖైదీవి నువ్వే అయి వుండాలి అంది. బ్రాడీకి చాలా కోపం వచ్చింది. నువ్వూ నీ ప్రేమా అంతా నటన, నీ కెరియర్‌లో పైకి వెళ్లడానికై నన్ను వాడుకున్నావ్‌ అని తిట్టిపోశాడు. క్యారీ అభ్యంతర పెట్టింది. ‘నీకు చేరువైనది వ్యూహంలో భాగంగానే. కానీ నీతో నిజంగానే ప్రేమలో పడ్డాను. మొన్న, నిన్న నీతో పొందిన సుఖం ముందెన్నడూ పొందలేదు.’ అని నిజాయితీగా చెప్పింది. కానీ బ్రాడీ నమ్మలేదు. నువ్వో బూటకపు మనిషివి, నీకూ నాకూ యింతటితో సరి అని తిట్టి, రివాల్వర్  అక్కడే వదిలేసి, దూరంగా పెట్టిన కారు దగ్గరకు వెళ్లిపోతున్నాడు. అంతలో సాల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.  

ఐలీన్‌ సహకారంతో స్కెచ్‌ ఆర్టిస్టు ఆమె వద్దకు వచ్చిన అమెరికన్‌ టెర్రరిస్టు బొమ్మ గీశాడు. చూస్తే అది టామ్‌ వాకర్‌ బొమ్మ. అతను అద్భుతమైన షూటర్‌ కాబట్టి, మైలు దూరం నుంచి హెలిపాడ్‌లో దిగే దేశాధ్యక్షుణ్ని గురి చూసి చంపడానికి అతన్ని టెర్రరిస్టులు వినియోగించారన్నమాట. టామ్‌ కాచుకున్న రోజు ఏ కారణం చేతనో అధ్యక్షుడు అక్కడకు రాలేదు. లేకపోతే అతని హత్య జరిగి వుండేది. ఈ విషయం అర్థం కాగానే అందరూ  తెల్లబోయారు. చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్న టామ్‌ బతికుండి టెర్రరిస్టుగా మారి యింతటి ఘాతుకానికి తలపెట్టడం ఊహించలేని ట్విస్టు. 

ఆ విషయం చెప్పడానికి సాల్‌ క్యారీకి ఫోన్‌ చేశాడు. టెర్రరిస్టుగా మారిన యుద్ధఖైదీ బ్రాడీ కాదు, టామ్‌! నీ అంచనా తప్పింది అని చెప్పాడు. వెంటనే క్యారీ నాలుక కరుచుకుంది. తన కారు వద్దకు వెళుతున్న బ్రాడీ దగ్గరకు పరిగెట్టి, ‘ఐ యామ్‌ సారీ, పొరబడ్డాను’ అంటూ చెప్పబోయింది. అప్పటికే అతనికి యీమెపై అసహ్యం తారస్థాయిలో ఉంది. ‘వెళ్లి దేనిలోనైనా దూకి చావు’ అని తిట్టేసి, కారులో వెళ్లిపోయాడు. క్యారీ ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ క్యాబిన్‌లోనే ఉండిపోయింది. ఇవతల బ్రాడీ కూడా యింటికి వచ్చి, నిద్రిస్తున్న భార్యాబిడ్డలను ఓసారి చూసుకుని, పెరట్లోకి వెళ్లి ఏడవసాగాడు.

నిజానికి టామ్‌ వాకర్‌ బతికే ఉన్నాడు. అతన్ని స్వహస్తాలతో చంపినట్లు బ్రాడీని నమ్మించాడు కానీ అబు నజీర్‌ అతన్ని ముందే తనవైపు తిప్పేసుకున్నాడు. ఎక్స్‌పర్ట్‌ షూటరైన టామ్‌ను టెర్రరిస్టుగా మార్చి, అతని ద్వారా హత్యలు చేయిద్దామని ప్లాను వేశాడు. బ్రాడీ తిరిగివెళ్లిన తర్వాత అతన్ని ఎవరైనా అడిగినా టామ్‌ చనిపోయాడని అతను చెప్పినది అందరూ నమ్ముతారు కాబట్టి అతని ఉనికి ఎవరూ గుర్తించలేరనుకున్నాడు. ఐలీన్‌ అల్‌ఖైదా దాడి నుంచి తప్పించుకుని ఉండకపోతే, సిఐఏకు పట్టుబడి వుండకపోతే, నోరు విప్పకపోతే టామ్‌ గురించి ఎవరూ ఊహించను కూడా ఊహించలేక పోయేవారు.

టామ్‌ రాజధాని మహానగరంలో ఎక్కడా స్థిరంగా ఉండకుండా రోడ్డు మీద అడుక్కుతినేవాడిలా తిరుగుతున్నాడు కాబట్టి ఎవరూ గుర్తించలేరు కూడా. సౌదీ అరేబియా రాయబార కార్యాయంలో ఉన్నతాధికారిగా పని చేస్తూ లోపాయికారీగా నజీర్‌కు సాయపడుతున్న (మన్సూర్‌ అల్‌) జహ్రానీ ద్వారా అతనికి ఆదేశాలు అందుతున్నాయి, వాటిని అతను అమలు చేస్తున్నాడు. ఆదేశాలందివ్వడానికి అతి సులభమైన మార్గం ఎంచుకున్నారు. ట్రాఫిక్‌ లైట్ల దగ్గర టామ్‌ ముష్టివాడిలా అందర్నీ డబ్బు అడుగుతూంటాడు. జహ్రానీ అతని చేతిలో ఓ డాలర్‌ నోటు పెడతాడు. దానిలోపల మడిచి పెట్టిన కాగితంలో ఏం చేయాలో రాసి వుంటుంది.

ఇలా జనసాగరంలో కలిసి పోయినవాణ్ని కనిపెట్టడం సిఐఏకు అతి కష్టం. అందువలన వాళ్లు అతని కుటుంబంపై దృష్టి పెట్టారు. అతని భార్య హెలెన్‌ను, వాళ్ల కొడుకు లూకాస్‌ను లాంగ్లీకి పిలిచి ప్రశ్నలు వేశారు. ఇదంతా ఆశ్చర్యకరంగా వుందని హెలెన్‌ చెప్పింది. లూకాస్‌ స్కూలు దగ్గర తండ్రిని చూశానని చెప్పాడని, కానీ తను నమ్మలేదని చెప్పింది. ఎందుకంటే ఎనిమిదేళ్ల క్రితం నాటి తండ్రి రూపురేఖలు గుర్తుంటాయని అనుకోలేదని, ఎవర్నో చూసి నాన్న అనుకుని ఉంటాడని భావించానని చెప్పింది. టామ్‌ తిరిగివచ్చాక తనను కాంటాక్ట్‌ చేయలేదని చెప్పింది. వీళ్లనిలా అడుగుతూండగానే పక్కగదిలో టామ్‌ చచ్చిపోయావని ఎందుకు చెప్పావని సాల్‌ బ్రాడీని అడుగుతున్నాడు. అతను చచ్చిపోయాడనే నేను యీ క్షణానికీ నా నమ్మకం అన్నాడు బ్రాడీ.

బ్రాడీ బయటకు వెళిపోతూండగా క్యారీ కనబడింది. అతనామె కేసి అసహ్యంగా చూసి ‘సమాచారం లాగడానికి ఎవడితోనైనా పడుక్కునే రకం నువ్వు. మనసనేదే లేదు.’ అని తిట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లగానే జెసికా కనబడింది. ఇద్దరూ గిల్టీగా ఫీలయ్యారు. జెసికా తన గోడు చెప్పుకుని ఏడ్చింది – ఆరేళ్ల పాటు నీ కోసం వేచి ఉన్నాను. ఎంతమంది వెంటపడినా చలించలేదు. కానీ ప్రభుత్వమే నువ్వు చచ్చిపోయావని చెప్పాక, నాకు, నా బిడ్డలకు అండ కావాలని తపించాను. అందుకే మైక్‌తో సంబంధం పెట్టుకున్నాను. అతనూ మన బిడ్డలకు తండ్రిగా వ్యవహరించాడు. నువ్వు తిరిగి వస్తావని, నేను దోషిగా నిలబడాల్సి చెప్పుకోవలసి వస్తుందని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు అప్పుడు తెలియదు.’ అంటూ ఉన్నదున్నట్లు చెప్పింది.

బ్రాడీ కరిగిపోయాడు. ‘నేను తప్పుపట్టటం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. కష్టమే అయినా తిరిగి సంసారాన్ని దిద్దుకుందాం.’ అన్నాడు. ఇద్దరూ ఊరడిల్లారు. ఇంతలో వైస్‌ ప్రెసిడెంటు  వాల్డెన్కు సలహాదారైన ఎలిజబెత్‌ అనే ఆమె బ్రాడీకి ఫోన్‌ చేసి ‘ఓ పెద్ద పార్టీ ఆర్గనైజ్‌ చేస్తున్నాను. కారు పంపిస్తాను. మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి.’ అని ఆహ్వానించింది. దంపతులిద్దరూ కాస్సేపు తటపటాయించి సరేనన్నారు.

సిఐఏ వాళ్లు టామ్‌ భార్య హెలెన్‌ యింటి లాండ్‌లైన్‌ ఫోన్‌ రికార్డు చెక్‌ చేశారు. అప్పుడప్పుడు వాళ్లు యింట్లో లేనప్పుడు కాల్స్‌ వస్తున్నాయి. ఇంటికి వచ్చాక హెలెన్‌ కానీ ఆమె కొడుకు కానీ ఆన్సరింగ్‌ మెషిన్‌ ద్వారా ఆన్సర్‌ చేస్తే మళ్లీ జవాబు ఉండటం లేదు. సాల్‌ దీన్ని విశ్లేషించాడు – టామ్‌కు కుటుంబమనేది బలహీనత. అందుకే కొడుకు స్కూలుకి వెళ్లి అతన్ని చాటుగా చూశాడు. భార్యతో డైరక్టుగా మాట్లాడకపోయినా, ఆమె వాయిస్‌ విని తృప్తిపడదామని ఆమె లేనప్పుడు కాల్‌ చేస్తున్నాడు. ఆన్సరింగ్‌ మెషిన్‌లో ఆమె గొంతు, ఒక్కోప్పుడు కొడుకు గొంతు విని సంతోషిస్తున్నాడు.

అందువలన హెలెన్‌ యింట్లో కాపుకాసి టామ్‌ ఏ బూత్‌నుంచి కాల్‌ చేస్తున్నాడో ట్రేస్‌ చేసి పట్టుకోవడం మంచిదన్నాడు. టామ్‌ కార్యకలాపాలు దేశం లోపల జరుగుతున్నాయి కాబట్టి అది ఎఫ్‌బిఐ పరిధిలోకి వస్తాయి. వాళ్లూ వచ్చి కూర్చున్నారు. ఎఫ్‌బిఐ మనిషి ఈ పద్ధతిని అంగీకరించలేదు. టామ్‌ ఎప్పుడు కాల్‌ చేస్తాడా అని వేచి చూడడం వలన టైము వేస్టవుతుందని అతని అభిప్రాయం. డేవిడ్‌ అన్నీ ఆలోచించి, టామ్‌ను పట్టుకునే పనికి క్యారీయే సమర్థురాలని ఎంచి, ఆ ప్రాజెక్టు ఆమెకు అప్పగించాడు. ఆ విషయం చెప్పడానికి ఆమె సాల్‌ యింటికి వెళ్లింది.

ఆ పాటికి మీరా ఇండియాకు వెళ్లిపోవడానికి సామాన్లు సర్దుకుంటోంది. అమెకు ఎలా నచ్చచెప్పాలో తెలియక సాల్‌ సతమతమవుతున్నాడు. కనీసం ఎలిజబెత్‌ పిలిచిన పార్టీకి హాజరై ఆ తర్వాత వెళ్లమని నచ్చచెపుతున్నాడు. క్యారీ వచ్చి న్యూస్‌ చెప్పగానే మంచిది అన్నాడు. బ్రాడీపై నీకు అనుమానం పోయినట్లేనా అన్నాడు. అప్పుడు క్యారీ చెప్పేసింది. నిఘా వేసినదంతా వృథా కావడంతో బ్రాడీని విడిగా కలిసి పరిచయం పెంచుకున్నానని, కానీ యిప్పుడదంతా ముగిసిన కథ అనీ చెప్పింది. టెర్రరిస్టు అనుమానితుడితో వ్యక్తిగత స్నేహం సాగించినందుకు సాల్‌ ఆమెకు చివాట్లేశాడు. చివరకు సరేలే, వెళ్లిరా అన్నాడు.

ఎలిజబెత్‌ యిస్తున్న పార్టీకి తలిదండ్రులిద్దరూ కలిసి వాళ్లు పంపిన లిమోజాన్‌లో సరదాగా వెళ్లడం చూసి  పిల్లలు  సంతోషించారు. పార్టీలో బ్రాడీకి ఎలిజబెత్‌ చాలా ప్రాధాన్యత యిచ్చింది. బ్రాడీ తన యుద్ధానుభవాలు వర్ణిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అందరూ అతన్ని హీరోని చూసినట్లు చూశారు. ఇంతలో టీవీలో ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఒక సెనేటర్‌ ఒక సెక్స్‌ స్కాండల్‌లో యిరుక్కున్నాడని, పార్టీ అతన్ని రాజీనామా చేయమని అడగవచ్చని వార్త. ఎలిజబెత్‌కి యీ విషయం ముందే తెలిసి వుంటుందని, ఆ పదవి బ్రాడీకి కట్టపెట్టేట్టు ఉన్నారని సాల్‌, తన భార్యతో అన్నాడు. పార్టీ తర్వాత కార్లో యింటికి వెళ్లేటప్పుడు జెసికా చాలా సరదాగా జోకులేసింది. ఆమెను అలా చూసి బ్రాడీకి కూడా హుషారు వచ్చింది. ఇంటికి వెళ్లి  పిల్లలతో సహా అందరూ టీవీలో సినిమా చూస్తూ కూర్చున్నారు.

క్యారీ తన టీమును వెంటపెట్టుకుని హెలెన్‌ యింటికి వెళ్లి కూర్చుంది.  పిల్లవాణ్ని తీసుకుని స్కూలుకి వెళ్లిపోయినట్లుగా నాటకం ఆడమని, మళ్లీ యింటికి చాటుగా వచ్చేయమని ఆమెకు చెప్పింది. ఆమె యింట్లోంచి బయటకు వెళ్లడం మాత్రమే గమనించిన టామ్‌ కాస్సేపటికి  ఓ బూత్‌ నుంచి లాండ్‌లైన్‌కు కాల్‌ చేశాడు. హెలెన్‌ ఆన్సర్‌ చేసి, హలో అంది. ఫోన్‌ వెంటనే కట్‌ అయిపోయింది. కాల్‌ను క్యారీ టీము ట్రేస్‌ చేస్తే అది ఎక్కడో ఊరి మూల నుంచి వచ్చింది.

హెలెన్‌ మనసంతా అదోలా అయిపోయింది. భర్త నిజంగానే బతికి వున్నాడని, ఆ వూళ్లోనే ఓ మూల ఉన్నాడని తెలియగానే కంగారు పడింది. టెర్రరిస్టుగా మారినా, తన మీద అతనికి ప్రేమ పోలేదని, కేవలం తన గొంతు వినడానికే తాపత్రయ పడుతున్నాడని అర్థమయ్యాక అతని కోసం ఆగకుండా పెళ్లి చేసేసుకున్నందుకు ఫీలైంది. క్యారీ అవన్నీ మనసులో పెట్టుకోవద్దని, అతను మళ్లీ ఫోన్‌ చేసి తీరతాడని, అప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండమని, అలా అయితే తన టీము ఆ కాల్‌ ట్రేస్‌ చేసి అతన్ని సజీవంగా పట్టుకోవడానికి వీలుంటుందని నచ్చచెప్పింది.
టామ్‌కు విషయంలో అతని భార్యే అతని బలహీనత. భార్య వాయిస్‌ మళ్లీ వినాలనే కోరికతో క్యారీ ఊహించినట్లుగానే మళ్లీ యింకో బూత్‌ నుంచి ఫోన్‌ చేశాడు. ఈసారి హెలెన్‌ ‘టామ్‌, నువ్వేనా?’ అని అడిగింది. జవాబు రాకపోయినా మాట్లాడడం మొదలుపెట్టింది. తను, కొడుకు అతన్నెలా మిస్‌ చేశారో, వెయిట్‌ చేశారో చెప్పసాగింది. టామ్‌ సమాధానం చెప్పకుండా మౌనంగా వింటూ వుండిపోయాడు. ఈ లోగా సిఐఏ, ఎఫ్‌బిఐ టీములు అతనెక్కడున్నాడో ట్రేస్‌ చేసి వేగంగా అతనున్న చోటికి చేరారు.

హెలెన్‌ మాట్లాడుతూమాట్లాడుతూ అతనంటే తనకు ప్రేమ చావలేదని చెప్పగానే టామ్‌ కరిగిపోయి ‘‘హెలెన్‌’’ అని ఆమె పేరు ఉచ్చరించాడు. ఆమె చలించిపోయింది. తను తన భర్తను పట్టిస్తున్నాననే స్పృహ కలిగి వెంటనే ‘టామ్‌, యీ కాల్‌ ట్రేస్‌ చేస్తున్నారు, జాగ్రత్త’ అని అరిచేసింది. పక్కనుంచి క్యారీ వారిస్తున్నా వినలేదు. టామ్‌ వెంటనే ఎలర్ట్‌ అయ్యాడు. సరిగ్గా గూఢచారి దళాలు రాగానే చాటుగా తప్పుకుని, వారిలో ఒకణ్ని చంపేసి, అతని పిస్టల్‌ తీసుకుని పారిపోయాడు.

ఎఫ్‌బిఐ దళాలు అతన్ని వెంటాడుతూ ఓ మసీదులోకి వెళ్లాయి. అక్కడ చీకటిలో సరిగ్గా కనబడక నమాజు చేసుకుంటున్న యిద్దర్ని కాల్చేశారు. టామ్‌ మసీదులోంచి వేరే మార్గం ద్వారా పారిపోయాడు.  అతనికి ముందు రోజే సౌదీ రాయబారి జహ్రానీ తన మామూలు పద్ధతిలోనే డాలరు నోటుతో బాటు ఒక తాళం చెవి, అడ్రసు రాసిన కాగితం యిచ్చివున్నాడు. టామ్‌ యిప్పుడు ఆ అడ్రసు ప్రకారం ఒక గోడౌన్‌కి చెరి అక్కడున్న ఒక పెట్టె తెరచి చూశాడు. దానిలో పెద్ద రైఫిల్‌ ఉంది.

మసీదులో అనుకోకుండా జరిగిన దుర్ఘటనతో సిఐఏ స్థయిర్యం చెదిరింది. ఇప్పటిదాకా టామ్‌ గురించి బయటి ప్రజలకు చెప్పకూడ దనుకున్నారు. చెపితే టెర్రరిస్టును పట్టుకోకుండా ఏం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయని వారి భయం. ఇప్పుడిక చెప్పక తప్పని పరిస్థితి. టెర్రరిస్టులను పట్టుకునే ప్రయత్నంలో, ఎదురుకాల్పులు జరిగాయని చెప్పుకుంటే కాస్త మేలు. అందువలన టామ్‌ ఫోటో విడుదల చేసి, ఇతను ఎక్కడైనా కనబడితే చెప్పమని పబ్లిక్‌ను అడుగుదామనుకున్నారు.

మర్నాడుదయం క్యారీ బ్రాడీ యింటికి వెళ్లి, అతన్ని బయటకు పిలిచి ‘టామ్‌ సజీవంగా ఉన్నాడని నిర్ధారణ అయింది. అతన్ని పట్టుకోవడానికి నీ సహకారం కావాలి. పబ్లిక్‌కి చెప్పడానికి ముందే నీకు చెప్తున్నా’ అంది. తనను ఆ ప్రాజెక్టుకి యిన్‌చార్జి చేశారని చెప్పగానే బ్రాడీ నేను ఊహించా అన్నట్లు కళ్లెగరేశాడు. క్యారీ అది గ్రహించి ‘నిజంగా చెపుతున్నాను, క్యాబిన్‌లో నా ప్రవర్తనకు, నా వృత్తికి సంబంధం లేదు.’ అని చెప్పుకుంది. జెసికాకు వచ్చిన వారెవరో, ఏమిటో అర్థం కాలేదు. వచ్చి యింటి ముంగిట నిబడి యీమె కేసి అనుమానంగా చూస్తూ నిబడింది. క్యారీ చెప్పినది విని బ్రాడీ భుజాలెగరేసి, భార్యతో సహా యింట్లోకి వెళ్లిపోయాడు.

అవేళ సాయంత్రం జహ్రానీ తన యింటికి చేరేసరికి తన లివింగ్‌ రూము సోఫాలో ఒకతను కూర్చుని టీవీలో టామ్‌ గురించిన వార్తలు చూస్తూ కనబడ్డాడు. ‘‘టామ్‌, మతిపోయిందా? ఇక్కడకు రావద్దని చెప్పేనుగా’ అని అరిచాడతను. తీరా చూస్తే సోఫాలో ఉన్నది బ్రాడీ. కోపంతో భగభగలాడుతున్నాడు. లేచి ‘‘టామ్‌ చచ్చిపోయాడని మీరంతా నాకు చెప్పారు, నమ్మించారు. మరి యిప్పుడు టామ్‌ ఎలా వచ్చాడు?’’ అని గద్దించాడు. జహ్రానీ బెదిరిపోయి, ‘అవన్నీ నువ్వు నజీర్‌నే అడగాలి. నన్నడిగితే నేనేం చెప్తాను?’ అన్నాడు. ‘నజీర్‌తో మాట్లాడేదీ, గీట్లాడేదీ ఏమీ లేదు. మా వ్యవహారం ఇంతటితో స్వస్తి అని చెప్పు.’ అనేసి బ్రాడీ విసవిసా బయటకు వచ్చేశాడు. (ఫోటో- ఎడమవైపు టామ్, ఎలిజబెత్ కుడివైపు బ్రాడీ, క్యారీ శృంగారం)  (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)