మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో తనది 0.01 శాతం తప్పు ఉందని తేలితే బహిరంగంగా ఉరి తీసుకుంటానని, మరి వైఎస్ జగన్ తరపు తప్పు ఉంటే ఏం చేస్తారో ప్రపంచానికి చెప్పాలని మాజీ మంత్రి,బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు.
కడప జిల్లా జమ్మలమడుగులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్యపై తీవ్ర స్థాయిలో స్పందించారు.వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారి కుటుంబ సభ్యులు, బంధువుల అంతరాత్మలకే తెలుసునన్నారు.
సిట్ దర్యాప్తునకు తాను హాజరు కాకుండా అజ్ఞాతంలో తిరుగుతున్నట్టు కొన్ని చానళ్లు ప్రసారం చేశాయని,అది వారి అజ్ఞానం అని మండిపడ్డారు. సంచలనాల కోసం మీడియా న్యూసెన్స్, నాన్‌సెన్స్ సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది మార్చి 15న వివేకా హత్య జరిగే సమయానికి తాను విజయవాడలో ఉన్నట్టు చెప్పాడు.వివేకా మృతి విషయమై ఆయన సొంత బామ్మర్దితోనూ, వారి కుమారుడితోనూ మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశానని తెలిపాడు.
ఆ రోజు ఐదారు గంటల పాటు గుండెపోటుతో మృతి చెందాడని సాక్షి సహా అన్ని చానళ్లు ప్రసారం చేశాయన్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా హత్య చేశారనే వార్తలు గుప్పుమన్నాయన్నాడు. ఈ నెల 15 నాటికి వివేకా హత్య జరిగి తొమ్మిది నెలలు పూర్తవుతుందన్నాడు.
ఇంత వరకూ అసలు దోషులెవరో ఎందుకు తేల్చలేదని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రశ్నించాడు.అప్పట్లో సిట్ వద్దు…సీబీఐ కావాలని డిమాండ్ చేయడమే కాకుండా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారన్నాడు. మరిప్పుడు సీబీఐ వద్దు సిట్-2 ముద్దు అని అంటున్నారన్నాడు.
అవునంటే కాదని, కాదంటే అవునని, అర్థాలే వేరులే అనే చందాన వైఎస్ జగన్ తరపు వారి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి వ్యవహారం ఆడిందే ఆట , పాడిందే పాటగా తయారైందని మండిపడ్డాడు.