న్యాయం కోసం 15 ఏళ్ల పోరాటం. ఇన్నేళ్లలో ఎప్పుడూ అతను నిరాశనిస్పృహలకు గురి కాలేదు. తన పోరాటంలో న్యాయం ఉందనే ఏకైక నమ్మకమే అతన్ని 15 ఏళ్ల తర్వాత ఉద్యోగం తిరిగి వరించింది. ఇందుకు అతనికి మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఎంతో సహకరించింది. ఆ సంఘం చొరవతోనే ఉద్యోగం దక్కింది. తన సంఘం పేరుకు సార్థకత లభించేలా ఓ బ్యాంకు ఉద్యోగి విషయంలో హెచ్ఆర్సీ తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
కరీంనగర్‌కు చెందిన కె.రాంబాబు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించేవారు. 1996లో ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో సెలవు పెట్టారు. ఉద్యోగి అనారోగ్యాన్ని, సెలవు పెట్టడాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా విధుల్లో నుంచి తొలగించారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశించి న్యాయం చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
2005లో రాంబాబుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ రాంబాబును విధుల్లోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశించినా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం స్పందించలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వివరాలను పరిశీలించిన హెచ్ఆర్సీ హైకోర్టు ఆదేశాల మేరకు రాంబాబుకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆదేశించింది.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు రాంబాబును విధుల్లోకి తీసుకుంటామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ హెచ్ ఆర్సీకి బుధవారం నివేదించారు. కరోనా కష్టకాలంలో తనకు తిరిగి ఉద్యోగం లభించడం ఆనందంగా ఉందని రాంబాబు తెలిపారు. తనకు ఉద్యోగం రావడానికి హెచ్ఆర్సీనే కారణమని అతను చెప్పుకొచ్చారు.