ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కరోనా కష్టకాలంలో మిగతా రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు అందుతున్నాయి. జగన్ ప్రవేశపెట్టిన నూతన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జగన్ ముందుచూపుకి మరో సత్ఫలితం కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సడలింపులతో పరిశ్రమలు తెరుచుకున్నా.. కార్మికులు లేక యాజమాన్యం ఇబ్బంది పడుతోంది. ఏపీతో సహా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. కార్మికులు ఎప్పుడు తిరిగొస్తారో తెలియదు, అసలు వస్తారో రారో కూడా అనుమానమే. ఈ కష్టకాలంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఆశాకిరణంలా కనిపిస్తోంది. ప్రైవేటు పరిశ్రమల్లో కూడా స్థానికులకే 75శాతం ఉద్యోగాలివ్వాలని జగన్ చట్టం చేస్తే కోర్టులకెక్కాయి ప్రతిపక్షాలు. ఇప్పుడిదే నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఆమోదయోగ్యమైంది.
ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, స్థానిక నిరుద్యోగులకు, విద్యార్థులకు అక్కడే శిక్షణనిచ్చే ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు స్థలాల పరిశీలన జరిగింది. కొన్ని చోట్ల అందుబాటులో ఉన్న భవనాల్లో శిక్షణ మొదలు పెడుతున్నారు.
ఇవి పూర్తిగా వినియోగంలోకి వస్తే.. రాష్ట్రంలో సాంకేతిక శిక్షణ లేని లేబర్ అంటూ ఎవరూ ఉండరు. కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాల వైపు చూడటం మానేస్తాయి. స్థానికంగా ఉన్నవారికే ఉద్యోగాలిస్తాయి, స్కిల్డ్ లేబర్ లేరనే కుంటిసాకులు చెప్పడానికి కుదరదు. అప్పుడిక కరోనా లాంటి ఉపద్రవాలొచ్చినా కంపెనీలపై పడే ప్రభావం తక్కువ.
వలస కష్టాలకు చెల్లుచీటీ ఈ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ బృహత్తర ప్రణాళిక ఫలాలు భవిష్యత్ లో ఏపీకి బాగా ఉపయోగపడతాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి పథకాల గురించి ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో స్థానికంగా ఉండేవారికే శిక్షణ ఇచ్చి, అక్కడే ఉద్యోగావకాశాలు కల్పిస్తే.. వలక కష్టాలుండవు. ఈ విషయంలో జగన్ దార్శనికత దేశానికే ఆదర్శం. ఈ లాక్ డౌన్ కష్టకాలంలో దేశం మొత్తానికి జగన్ విజన్ తెలిసొచ్చింది.